పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రాణాలను కోల్పోతున్న ఆందోళనకారులు
posted on Dec 20, 2019 @ 1:17PM
పౌరసత్వ సవరణ బిల్లు పై పోలీసులకి, వ్యతిరేకిస్తున్న నేతల మధ్య అగ్గి రాజేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. బీజేపీ పాలిత కర్ణాటకలోని మంగళూరులో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులకు బుల్లెట్ గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్ ముట్టడించటం సహా పలు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టినందునే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఈ నెల 22 అర్ధరాత్రి వరకు మంగళూరులో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పొరుగు రాష్ట్రం కేరళకు చెందిన ఆందోళనకారులే హింసకు కారణమని కర్ణాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులోనూ నిరసనల ఉధృతరూపం దాల్చాయి. బెంగళూరులోని టౌన్ హాల్ వద్ద అరవై వేలకు పైగా ఆందోళనకారులు రహదారులను స్తంభింపజేశారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వామపక్ష నేతలతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను అదుపు లోకి తీసుకోవడం దారుణమని రామచంద్ర గుహ ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ హాల్ వద్ద నిరసనకారులు ఎంతకీ కదలకపోవడంతో బెంగళూరు సెంట్రల్ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ జాతీయ గీతం ఆలపించారు. గీతం ఆలపించిన తర్వాత ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
భాజపా అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. లఖ్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్వి పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. సంభల్ జిల్లా లోనూ ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగి ఓ బస్సుకు నిప్పు పెట్టారు. రేపు మధ్యాహ్నం వరకు లఖ్నోలో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలు నిలిపివేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని షాహి ఆలంలో నిరసనకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. అనుమతి లేకుండా నిరసన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్విన ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. అహ్మదాబాద్ లోని మిర్జాపూర్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది ఆందోళనకారులు గాయపడ్డారు.
ముంబైలో కాంగ్రెస్, ఎన్సీపీ సహా వివిధ పార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆగస్ట్ క్రాంతి మైదానంలో శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. వీటిలో పలు రాజకీయ పార్టీల కార్యకర్తలూ బాలీవుడ్ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. శివసేన ప్రదర్శనకు దూరంగా ఉన్నప్పటికీ పౌరసత్వం కల్పించిన హిందూ శరణార్థులను కేంద్రం ఎక్కడ ఎలా ఉంచాలని అనుకుంటోందని ప్రశ్నించింది. నాసిక్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో పేరుతో ర్యాలీ జరిగింది. మధ్యప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఆందోళనలు కూడా ఎగిసిపడ్డాయి. మధ్యప్రదేశ్ లోని 43 జిల్లాలలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ లోనూ ఆందోళనకారులు కదం తొక్కారు. ఎర్రకోట, పాత ఢిల్లీ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు హోరెత్తాయి. ఆందోళనకు దూరంగా ఉండాలన్న సూచనలను విస్మరించి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, ఆచార్యులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనల వల్ల 20 మెట్రో స్టేషన్ లు మూసి వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ వైపు ఉచిత వైఫై సేవలను ప్రారంభించగా మరో వైపు ఇంటర్నెట్ సేవలను, ఎస్సెమ్మెస్ లను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళనలతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఢిల్లీలో గురుగ్రామ్ మార్గంలో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిబ్బంది సకాలంలో చేరుకోలేక 19 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి.