వినదగునెవ్వరు చెప్పిన...

"ఒరేయ్ బాబూ… అది కాదురా దారి ఇది. ఇలా వెళ్ళాలి" అంటాడు ఓ పెద్దాయన.

"ఎహె!! నేను నీ మాట ఎందుకు వినాలి పెద్దరికం ఉంటే ఇంతే, ప్రతిదానికి అడ్డుపడతారు" అంటాడు ఓ కుర్రకుంక.

"ఒరేయ్ నానీ నీకు కథ చెబుతానురా…." అంటాడు ఒక ముసలాయన.

"ఉరుకో నాన్నా చదస్తపు కథలతో ఎందుకు పిల్లొళ్లను మూర్ఖులుగా మార్చుతావు అంటాడు కొడుకు.

"అన్నా!! నువ్వు వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు. నేను చెబుతానురా" అంటాడు ఒక పిల్లాడు.

"ఒరేయ్ నాకంటే నీకు ఎక్కువ తెలుసా ఊరికే నా టైమ్ వేస్ట్ చేయక పోరా ఇక్కణ్ణుంచి" అంటాడు ఆ పెద్దోడు.


ఇలాంటివి ప్రతి మనిషి జీవితంలో, ఆ మనిషి చుట్టూరా చాలా వినబడుతూ, కనబడుతూ ఉంటాయి. ఈకాలం మనుషులు చాలా తక్కువ విస్తృతంలో ఇరుక్కుపోయారు. మనిషి ఎంత ఆలోచిస్తే అంత, ఎంత తెలుసుకుంటే అంత అనే విషయాన్ని మెల్లిగా మెదళ్లలో నుండి తీసేసారు. ఫలితంగా తెలుసుకోవడాన్ని, వినడాన్ని ఓర్పుతో సహా కోల్పోయారు. అంతేనా ఏదైనా విషయం తెలిసిందీ అంటే అందులో తమ గురించి ఇతరులు ఎదో అన్నారు అని తెలిసిందంటే ఒకేసారి యుద్దానికి వెళ్లినట్టు వెళ్లి, గొడవ చేసి, రచ్చ చేసి కానీ వదిలిపెట్టరు. కానీ చివరకు ఒకోసారి తెలుస్తుంది అవగాహన లేకపోవడం వల్ల ఏదో అనేసుకున్నారు అని, అది కూడా అవగింజ అంత విషయాన్ని కొండంత చేసి చెప్పారని.


సుమతీ శతకకర్త పద్యంలో చెబుతాడు 

వినదగునెవ్వరు చెప్పిన 

వినినంతనే వేగపడక వివరింపదగున్

కనికల్ల నిజము దెలిసిన 

మనుజుడేపో నీతిపరుడు మహిలో సుమతీ!! అని


ఎవరు ఏమి చెప్పినా వినాలి అలా విన్న తరువాత ఆ చెప్పిన విషయంలో నిజమెంత అనేది తెలుసుకోవాలి, అలా తెలుసుకున్న తరువాత చెప్పిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. అలా నిదానంగా అన్నీ తెలుసుకున్నవాడే నీతివంతమైనవాడు ఈ ప్రపంచంలో అని అర్థం. 


కానీ అందరూ ప్రస్తుత కాలంలో ఏమి చేస్తున్నారు?? 


చాలామంది ఎవరైనా ఏదైనా చెబితే అనే మొదటి మాట అంతా తెలిసినట్టు బిల్డప్పు అని అంటారు. ఇది బయటకు అనకపోయినా మనసులో అయినా అనుకునేస్తారు. అంతేనా!! ఏదైనా ఒక విషయం ఎవరైనా చెప్పెయ్యగానే అందులో పొరపాటున తమ పేరు ఉంటే ఇక అయిపాయే!! ఉగ్రతాండవం చేస్తారు ఆ వ్యక్తి మీద. ఇంకా కొందరుంటారు వైరస్ లెక్కన. ఒక విషయం తెలియగానే అందులో నిజానిజాలు, కారణాలు ఏమి తెలుసుకోకుండా వైరస్ ఎలాగైతే వ్యాపిస్తోందో అలా విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసేస్తారు. అది కూడా మాములుగా కాదు, ఉన్న విషయానికి ఇంకాస్త తమలో ఉన్న నైపుణ్యం జోడించి చిలువలు పలువలు చేసి చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అదొక పైశాచిక ఆనందం వాళ్లకు.


ప్రస్తుత కాలం ఇట్లా ఏడ్చింది కాబట్టే మనుషుల మధ్య ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇంకా అన్నిటికీ మించి స్నేహాభావం కూడా కరువయ్యింది. కనీసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య కూడా సరైన అవగాహన ఉండటం లేదు. వస్తువులకు, ఆర్థిక కలాపాలకు ఇచ్చిన ప్రాధాన్యత మనుషుల విషయంలో  ఇవ్వడం లేదు. 


ఒకసారి ఓపిక తెచ్చుకోవాలి


ఒకసారి ఎదుటివారి మాట వినాలి


ఒకసారి నిజానిజాలు గ్రహించాలి


ఆ తరువాత అన్నీ అర్థమవుతాయి


మనుషులే కాదు


ప్రపంచం కూడా…..

◆ వెంకటేష్ పువ్వాడ