కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలా??
posted on Sep 18, 2024 @ 9:30AM
చాలా మంది జీవితాల్లో భిన్న సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ఒక్కోటి ఒకో విధంగా ఉంటాయి. ప్రతి మనిషీ తన జీవితంలో ఏదో ఒకటి ఆశించే ప్రతి పనీ చేస్తాడు. కొన్ని పనులలో స్వేచ్ఛ ఉంటుంది. అభిరుచి ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని నియమాలు లోబడి, కొన్ని పరిధులలో మాత్రమే ఉండి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా జీవితంలో చాలా మంది విలువ ఇచ్చే విద్య, ఉద్యోగం, జీవితాంతం తోడుండే భాగస్వామి, ఇంకా వ్యక్తిగతంగానూ, ఆర్థికంగానూ ఎదుగుతూ ఉండే విషయాలు. ఇలా అన్నింటిలో కూడా అన్నీ అనుకున్నట్టు జరగవు, అనుకున్నట్టుగా సొంతమవ్వవు అని అంటారు. అందుకే సర్దుకుపోవాలి అనే సూత్రాన్ని అందరి బుర్రల్లో జొప్పించేస్తూ ఉంటారు. అయితే అది నిజమేనా?? జీవితంలో దేన్నీ కోల్పోకుండా, ఏ విధంగానూ కాంప్రమైజ్ కాకుండా జీవించడం సాధ్యమవుతుందా??
వాస్తవ కోణంలో….
నిజానికి చిన్నతనంలో భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు చెప్పింది, తల్లిదండ్రులకు నచ్చింది చేసుకుంటూ పోవడంలోనే జీవితాలు సగం అరిగిపోతున్నాయి. ఏమి చదవాలి, భవిష్యత్తులో ఏమి చేయాలి అని నిర్ణయాలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వరు తల్లిదండ్రులు. అలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అలా ఉన్నవాళ్లు మంచి విద్యావేత్తలూ, సమాజాన్ని ఎంతో లోతుగా చూసి విశ్లేషించి పరిపక్వత కలిగిన వాళ్ళు అయిఉంటారు. కాబట్టి వాస్తవకోణంలో చూస్తే నీకేం కావాలి అని అడిగే తల్లిదండ్రుల కంటే ఇది తీసుకో, ఇదే తీసుకో అనే వాళ్ళు ఎక్కువ.
అభిరుచులు, ఇష్టాలు, ప్రాధాన్యత!!
చిన్నతనం నుండి ఏదో ఒక విషయంలో అధిక ఆసక్తి ఉండటం గమనించవచ్చు. అది క్రమంగా పెద్దవుతూ ఉంటే దానిలో నైపుణ్యం కూడా పెంచుకోవచ్చు. కానీ భారతీయ తల్లిదండ్రులలో భవిష్యత్తులో ఉద్యోగాలు చెయ్యాలి. అలా చేయాలంటే చదువే ముఖ్యం. అభిరుచులు గట్రా అన్నీ పనికిమాలినవి అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. దాని కారణంగా ఎంతోమంది సృజనాత్మకతను మొగ్గదశలోనే చంపేసుకుంటున్నారు. అలా ఆకాకుండా సృజనాత్మకతను విద్యకు ఉత్ప్రేరకంగా వాడుకుంటే ఎంతో గొప్ప భవిష్యత్తును చూడవచ్చు.
ఆత్మవిశ్వాసం ఉంటే సాధ్యమే!!
కొందరికి కొన్ని ఇష్టాలు, అభిరుచులు ఉంటాయి. ఆ ఇష్టాలు అభిరుచులు చాలా చిన్నవి అయి ఉంటాయి. కానీ వాటిని కాదని పెద్ద వాటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది జీవితంలో. బహుశా అవి ముఖ్యమైన విషయాలు కూడా కావచ్చు. కానీ ఆత్మతృప్తిని లేకుండా ఎంత పెద్ద పనులు చేసినా ఎంత ఎత్తుకు ఎదిగినా మనసులో ఏదో ఒక అసంతృప్తి ఉండనే ఉంటుంది. కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఇష్టమైనవి ఆత్మతృప్తి కోసం చేసుకుంటూ, జీవితంలో ఎదగడానికి అవసరమైనవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సినది ఆత్మతృప్తిని, ఆర్థిక ఎదుగుదలను పోల్చి చూడకూడదు. వాటిని మాత్రమే కాదు జీవితంలో ఏ పని ప్రాధాన్యత దానిది అని గుర్తిస్తే ఇది కావాలి ఇది వద్దు అనే ప్రసక్తి లేకుండా ఇష్టమైనవి అన్ని పొందవచ్చు.
అవ్వా కావాలా?? బువ్వ కావాలా??
కాదు కాదు
మనసుకు నచ్చింది చేసుకుపోవాలి.
నిజమే మరి మనసుకు నచ్చింది ఏదైనా వంద శాతం శ్రద్ధతోనూ, ఆసక్తితోనూ, ఇష్టంతోనూ చేస్తాము కాబట్టి జయం మనదేరా తృప్తి మనదేరా అనుకోవాలి. అవ్వా, బువ్వా ఒక్కటే తీసుకో అని అంటే ఎలాంటి సందేహం లేకుండా అవ్వతో బువ్వ పెట్టించేసుకోవడం లాంటిదన్నమాట.
◆ వెంకటేష్ పువ్వాడ