Read more!

వ్యసనాలకు విడాకులిచ్చేద్దాం!

ప్రస్తుత కాలంలో మనుషులకు ఏదైనా ఒక కొత్త వస్తువు లేదా కొత్త ఆహారపదార్థం లేదా కొత్త స్టైల్ ను అనుసరించడం ఇంకా ఇంకా కొత్తదనం అనుకుంటూ వాటిని జీవితంలో భాగం చేసుకుంటూ ఉండటం అలవాటు. అలాంటి కొత్తదనం వెంట పరుగులుతీసే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో లేదా అంతకు మించి విషయాల్లో ఎక్కువగా మునిగిపోతుంటారు. ఆ విషయాల గురించే తప్ప వేరే ఏ విషయం గురించీ ఆలోచించలేనంత పిచ్చోళ్ళు అవుతుంటారు. అలాంటి పిచ్చిని వ్యసనం అని కూడా అనొచ్చు.


ఈ వ్యసనం చాలామందిలో, చాలా విషయాల్లో ఉన్నట్టు, చాలా రకాలుగా కూడా ఉంటుంది. అయితే ఆ వ్యసనం జీవితాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది అంతలా జీవితాన్ని తికమకలోకి నెడుతున్నా ఒత్తిడికి లోనవుతూ కూడా ఆ వ్యసనాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. ఎందుకంటే అది వ్యసనం మరి. 


ఈకాలంలో చాలామంది మొబైల్ ఫోన్ లకు, ఫుడ్ విషయంలో, తాత్కాలిక సంతోషాన్నిచ్చే విషయాలకు, ఇంకా మనుషులకు, కొన్ని విచిత్రమైన అలవాట్లకు, మగవాళ్ళు అయితే ధూమపానం, మద్యపానం, అమ్మాయిలు అయితే షాపింగ్, మేకప్ ఇలా చాలా విషయాలను అతిగా ఇష్టపడుతూ వాటికి వ్యసనపరులుగా  మారిపోతున్నారు. అలా మారినవాళ్ళు కూడా చాలామంది ఉంది ఉన్నారు ప్రస్తుత సమాజంలో.  దేన్నైనా జీవితంలో ఒక భాగంగా ఉంచుకోవడం మంచిదే కానీ జీవితమే ఆ విషయానికి అంకితం చేసేయ్యకూడదు. అలా చేస్తే జీవితమంతా కల్లోలమే కదా!! 

అలాంటి కల్లోలాన్ని తప్పించుకోవాలంటే వ్యసనానికి  విడాకులు ఇచ్చేయ్యాలి. 

పరిధులు, పరిమితులు!

మనిషి ఆలోచనలకు ఒక పరిధి ఉన్నట్టే అలవాట్లకు కూడా ఒక పరిధి  ఉంటుంది. ఆ పరిది దాటిపోతే మనిషి పరిమితులు కూడా అస్తవ్యస్తం అవుతాయి.  నిజానికి మనిషి స్థాయిని బట్టి పరిమితులు కూడా ఉన్నప్పుడు అవి అస్తవ్యస్తం అయితే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. వాటన్నిటినీ ఒకటికీ రెండు సార్లు విశ్లేషించుకుంటూ ఉంటే వ్యసనం అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 


ప్రతి విషయానికి ఒక పరిధి నిర్దేశించుకుంటూ ఉంటే అది అతిగా మారదు. భోజనం చేసేటప్పుడు కళ్లెదురుగా నచ్చిన పదార్థం ఎంతున్నా అది కడుపు నిండేవరకు మాత్రమే తినగలం, అలా కాదని ఎక్కువ తింటే రోజంతా ఇబ్బంది పడాల్సిందే. ఇంకా ఒక పదార్థాన్ని మితంగా తింటే హాయిగా ఉంటుంది అలా కాకుండా ఇష్టానుసారం తినేస్తే అజీర్తి, దాని వెంట మళ్లీ అనుబంధంగా బోలెడు సమస్యలు కూడా వస్తాయి. తీపి పదార్థాలు ఇష్టమని అతిగా తింటే చెక్కర వ్యాధి శరీరాన్ని కబళించి ఇక మళ్లీ తీపిని కన్నెత్తి చూడనివ్వని పరిస్థితికి నెట్టేస్తుంది.


మార్పు కోసం మంత్రం!


వ్యాసనాల బారినపడ్డవారికి వాటి నుండి బయటకు వచ్చేయ్యాలి అని ఉన్నా గట్టిగా దాన్నుండి దూరం కాలేరు. మనసు నిలకడ లేనితనం దానికో పెద్ద కారణం.  నిర్ణయం తీసుకోవడం సులువే కానీ దానిమీద గట్టిగా నిలబడటమే కొంచం కాదు చాలా కష్టం. అయితే నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లవాడి వేలుకు వేపనూనె పూస్తే వాడు నోట్లో వేలు పెట్టుకోవడానికి ఎలా భయపడి ఆ అలవాటు నుండి దూరమవుతాడో అలాగే వ్యసనం అనుకున్న  విషయం నుండి దూరమవ్వడానికి ఏదో ఒక పరిస్థితిని అడ్డు కల్పించుకుంటూ ఉండాలి. 


"పిల్లాడంటే తెలియని అమాయకుడు, పెరిగి పెద్దయిన ఈ ఉద్దండుల సంగతేంటి??" అనే ప్రశ్న గనుక వస్తే ఈ పిచ్చి మనసును బుజ్జగించడం అంతే సులువేమీ కాదు. కాబట్టి ఒకపని తప్పించుకోవాలి అంటే మరొకపనిని తప్పనిసరిగా, తప్పకుండా చెయ్యాల్సిన పనిగా ఒక లక్ష్యంగా ముందేసుకోవాలి. అప్పుడే అనుకున్నది సాదించగలం.

ఊగిసలాట వద్దు!

ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ మళ్లీ ముందుకూ వెనక్కు మనసును ఊగించకూడదు. మొదట్లో అలా వ్యసనంగా మారిన పని నుండి, విషయం నుండి దూరంగా ఉంటున్నందుకు అసహనంగానూ, బాధగానూ ఉన్నా అది మెల్లిగా తగ్గుతూ మరొకవిషయంలో మనసును లీనం చేస్తుంది. కాబట్టి ఊగిసలాట ఇక్కడ అసలు ఉండకూడదు. చాలామంది నిర్ణయాలు తీసుకుని, దారులు మార్చుకుని, పట్టుమని నిమిషాలు గంటలు కూడా కాకముందే చేతులెత్తేస్తారు. అలా కాకుండా మెల్లి మెల్లిగా ఆ పనికి తక్కువ సమస్య కేటాయిస్తూ వెళ్తే ఆ వ్యాసనమనే భూతం నుండి తప్పించుకోవడం పెద్ద సమస్యేమీ కాదు!

కాబట్టి జీవితాన్ని చిన్నాభిన్నం చేసే ఏ సమస్యనూ, వ్యసనంగా మార్చుకోవద్దు, వ్యసనంగా మారిన దేన్నీ భరించద్దు దానికి వెంటనే మార్పు అనే మంత్రంతో విడాకులు ఇచ్చేయండి.

◆ వెంకటేష్ పువ్వాడ