ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమం.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మల
posted on Feb 1, 2023 @ 10:43AM
ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమ పనితీరుతో ప్రకాశవంతంగా నిలిచిందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కరోనా సమయంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా చూసేందుకు ఉచిత ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించినట్లు వెల్లడించారు.డిజిటల్ సేవలను సాధారణ ప్రజల వరకు తీసుకెళ్లేందుకు కోవిన్, ఆధార్ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దేశంలో తలసరి ఆదాయం రూ. 1.97 లక్షలుగా ఉన్నట్లు వెల్లడించారు. పరిపాలన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో భారత్ అత్యుత్తమ పనితీరు కనబరిచిందన్నారు. 2022లో డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయన్నారు. టెక్నీలజీ ఆధారిత అభివృద్దితో ముందుకు సాగేందుకు దేశ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోని మహిళలకు శక్తివంతంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ వృద్ధి రేటు 7 శాతంగా ఉండనున్నట్లు తాము అంచనా వేసినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎంఎస్ఎంఈల వృద్ధికి రుణాలు అందించటంతో పాటు, స్కిల్ డెవలప్ మెంట్, డిజిటల్ సేవలను చేరువ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ బడ్జెట్లో లడఖ్, కశ్మీర్, ఉత్తర భారతంపై దృష్టి సారించినట్లు చెప్పారు. వ్యవసాయ స్టార్టప్స్ కోసం నిధి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనిని రైతుల సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తామన్నారు. ఆత్మనిర్బర్ క్లీన్ ప్లాంట్ పథకాన్ని తీసురుకురానున్నట్లు వెల్లడించారు. దీని కోసం రూ.2000 కోట్లను కేటాయిస్తున్నట్లు నిర్మలాసీతారామన్ తెలిపారు. చిరుధాన్యాలకు గ్లోబర్ హబ్ గా భారత్ నిలిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.