సుస్థిర పురోగతి దిశగా భారత్ అడుగులు.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్
posted on Feb 1, 2023 @ 10:29AM
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు చేరుకున్నారు. మరి కొద్ది క్షణాల్లో లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ఆరంభించారు. అంతకు ముందు బడ్జెట్ కాపీలు లోక్ సభకు ప్రత్యేక వాహనంలో వచ్చాయి. కాగా తన ప్రసంగంలో వసుధైక కుటుంబం లక్ష్యంతో బడ్జెట్ రూపొందించిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పురోగమిస్తోందని అన్నారు.
తొమ్మిదేళ్ల కిందట ఎక్కడో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు ఆశాదీపంగా తన బడ్జెట్ ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. వృద్ధి రేటు 7శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా అభివృద్ధి మందగిస్తే.. భారత్ మాత్రం ప్రగతి బాటలో దూసుకు పోయిందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
కోవిడ్ సమయంలో పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా అది కొనసాగుతుందన్నారు. స్థిరమైన అభివృద్ధి దిశగా భారత్ సాగుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ కారణంగానే ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ లో భాగంగా 11.7 కోట్ల రూపాయల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామనీ, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు 220 కోట్ల వ్యక్సిన్ లను అందించినట్లు చెప్పారు. అలాగే 44 కోట్ల మందికి పీఎం సురక్షా బీమాయోజన పథకాన్ని అందిస్తున్నామన్నారు.
వ్యవసాయం కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలు, రుణ సదుపాయం, మార్కెటింగ్ ఫెసిలిటీలు, అగ్రికల్చర్ స్టార్ట్ అప్ లను చేయూత కోసం ప్రత్యేక నిథి ఏర్పాటు, అలాగూ రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు, పత్తి సాగు మెరుగుదల కోసం చర్యల, మార్కెటింగ్ ఫెసిలిటీతో పాటు చిరుధాన్యాల పంటలకు సహకారం అందిస్తామన్నారు. ఇందుకోసం శ్రీ అన్న పథకం కింద రాగులు, జొన్నలు, సజ్జలు తదితర పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.