బంగ్లాదేశ్ బెదిరింపు సెక్షన్!
posted on Sep 2, 2024 @ 1:23PM
పిల్లకుంక బంగ్లాదేశ్ భారతదేశం మీద బెదిరింపులకు దిగుతోంది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాని తమకు అప్పగించాలి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తోంది. భారతదేశం సహకారంతో స్వాతంత్ర్యం పొందిన ఈ దేశం ఇప్పుడు ఇండియానే ఎదిరిస్తూ మాట్లాడుతోంది. షేక్ హసీనాను భారత్ తమ దేశానికి అప్పగిస్తుందా, లేదా అని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ఆవేశంగా ప్రశ్నిస్తోంది. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, హసీనాను బంగ్లాదేశ్‌కి రప్పించడానికి యూనస్ ప్రభుత్వం ఎంతదూరమైనా వెళ్తుందని అన్నారు. హసీనాని తమకు అప్పగించాలని ఇండియాని ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వడం లేదని ఆయనగారు సీరియస్ అయిపోయారు. హసీనాను తమకు అప్పగిస్తారా లేదా అనే విషయంలో ఇండియా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. "మా న్యాయ వ్యవస్థ ద్వారా హసీనాను ఎలాగైనా బంగ్లాదేశ్‌కి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం.’’ అంటున్నారు. హసీనా ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టడంతో ఆమె బంగ్లాదేశ్‌ని విడిచిపెట్టి ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెకు ఇండియాలోనే ఆశ్రయం కొనసాగితే భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని బంగ్లాదేశ్ అధికారులు అంటున్నారు.