ప్రశ్నా పత్రాలతోపాటు ఆన్సర్ షీట్లు ఫ్రీ
posted on Mar 5, 2012 @ 3:06PM
ప్రహాసనంగా మారుతున్న ప్రైవేట్ దూరవిద్య
హైదరాబాద్: రాష్ట్రంలో దూరవిద్య ప్రహాసనంగా మారింది. దూరవిద్యా కేంద్రాలు తరపున పరీక్షలు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు చదువులను అపహాస్యంపాలు చేస్తున్నాయి. అభ్యర్ధులనుంచి పాస్ గ్యారంటీ పేరుతో వేలాది రూపాయలు దండుకుని దొడ్డిదారిన పరీక్షలు రాయించి సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ఆయా అభ్యర్ధుల ఇంటికి వెళ్ళి పరీక్షా పత్రాలు ఇచ్చి దగ్గరే ఉండి జవాబులు రాయిస్తున్న సంఘటనలు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చాయి. తెలంగాణా ప్రాంతంలోని నిజామాబాద్,ఉత్తరాంధ్రలోని విజయనగరం ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఉద్యోగాల్లో స్థిరపడినవారు ఇతర అవకాశాల కోసం ప్రైవేట్ పిజీ, డిగ్రీ పరీక్షలు రాసేందుకు సిద్ధపడుతున్నారు. డిగ్రీకోసం వారు వేలాది రూపాయలు ఖర్చుపెట్టడానికి సైతం వెనుకాడటం లేదు. వారి అవసరాన్ని గమనిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు ఇలా అడ్డదారులు తొక్కుతున్నాయి. చాలాచోట్ల ఈ పరీక్షలు పెద్ద ప్రహాసనంగా మారాయి. ప్రశ్నాపాత్రలతో పాటు జవాబుల జిరాక్స్ కాపీలను కూడా జతచేసి అభ్యర్ధులకు ఇస్తున్నారు. అభ్యర్ధులు ఆ జవాబు పత్రాలను యథాతధంగా వ్రాస్తున్నారు.