చంద్రబాబు పర్యటనలకు జన ప్రభంజనం దేనికి సంకేతం?
posted on Nov 18, 2022 @ 11:08AM
1982 నాటి ఎన్టీఆర్ ప్రభంజనం గుర్తుకు వస్తున్నదా? చంద్రబాబు కర్నూలు పర్యటనకు జనం ప్రభంజనంలా తరలి రావడంతో నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయా? అంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు ఔననే అంటున్నారు.
ఒంగోలు వేదికగా జరిగిన తెలుగుదేశం మహానాడు నుంచి ఆ పార్టీ అధినేత ఎక్కడకు వెడితే అక్కడ జనం నీరాజనం పడుతున్నారు. జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విపక్షం వెనుక ర్యాలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మూడు రోజులుగా సాగుతున్న ఆయన పర్యటనలో ఆయన పర్యటన సాగిన దారంతా జన సముద్రంగా మారిపోయింది. అశేష జన సందోహం అడుగడుగునా నీరాజనం పడుతుండటంతో ఆయన పర్యటన షెడ్యూల్ టైం కంటే కనీసం ఎనిమిది తొమ్మిది గంటలు ఆలస్యంగా సాగుతోంది. అయినా జనం కదలకుండా ఓపిగ్గా నిరీక్షిస్తున్నారు. అదే జగన్ సభలకు జనాన్ని బలవంతంగా సమీకరించి తీసుకువచ్చినా వారు సభ లో కూర్చో లేక బయటకు వెళ్లిపోతున్నారు.
పోలీసులు అడ్డుపడుతుంటే కూడా విదిలించుకుని వెళ్లిపోతున్నారు. అదే చంద్రబాబు కర్నూలు పర్యటనలో జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. చంద్రబాబు పర్యటనలో విపరీతమైన జాప్యం జరిగినా ఓపికగా వేచి చూశారు. ఆయన ప్రసంగం శ్రద్ధగా విన్నారు. సాధారణంగా ఒక పార్టీ అధినేత పర్యటనకు వస్తున్నప్పడు జనసమీకరణ ఉంటుంది. అలాగే చంద్రబాబు పర్యటనకూ తెలుగుదేశం జిల్లా నాయకులు జన సమీకరణ చేసే ఉంటారు. అయితే ఆ సమీకరణ చాలా పరిమితం. ఎందుకంటే జనాన్ని తరలించడానికి విపక్షానికి ఆర్టీసీ బస్సులను అద్దెకిచ్చే పరిస్థితి లేదు. డ్వాక్రా మహిళలు వచ్చే అవకాశమూ లేదు. ఎందుకంటే ఆర్టీసీ, డ్వాక్రా మహిళలూ కూడా ప్రభుత్వ బంధనాల్లో చిక్కుకుని ఉన్నాయి. దీంతో కర్నూలు పర్యటనలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన అశేష జనవాహిని అంతా స్వచ్ఛందంగానే వచ్చిందేనని చెప్పాలి. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన అనగానే వైసీపీ శ్రేణులు మూడు రాజధానుల పేరుతో ర్యాలీలు నిర్వహించారు.
అయితే అవి ఎవరికీ పట్లని ర్యాలీలుగా మిగిలిపోయాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామన్న గంభీర ప్రకటనలు సైతం చేశారు. అయితే బాబు పర్యటనకు వచ్చిన అనూహ్య స్పందనతో నిరసనల ఊసెత్తడానికి కూడా వారు భయపడే పరిస్థితి వచ్చింది. కర్నూలు గడ్డపై మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అన్న నినాదాలు ప్రతిధ్వనించాయి. ఒక్క కర్నూలు అనే కాదు ఇటీవలి కాలంలో చంద్రబాబు ఎక్కడ పర్యటించినా జన స్పందన భారీగా ఉంటోంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు నిలిపేస్తారని వైసీపీ చేస్తున్న హెచ్చరికలను జనం విశ్వసించడం లేదనడానికి ఆయన పర్యటనలకు వస్తున్న విశేష స్పందనే నిదర్శనం.