సమభావం లేనప్పుడు అన్నీ ఒకేలా ఎలా?
posted on Oct 29, 2022 @ 12:58PM
బీజేపీ వారికి దేశభక్తి మరీ నరనరాల నిండిపోతోంది. భక్తి తో తూగిపోతున్నారు, దాన్ని అందరికీ పంచాలి. సామాన్యు లకు బోధించాలి. అందుకే ప్రధాని మోదీజీ మన్ కీ బాత్ పేరుతో బోధానంద మోదీజీ గా మారారు. మనసులో మాట మరీ జనాంతికంగానే అనేసి దాన్ని కార్యరూపంలోకి తెచ్చేయడానికి అధికార యంత్రాన్ని అమాంతం రంగంలోకి దింపేయడం అన్నీ రాజకీయతంత్రంగానే భావించాలి. మనసులో మాట అంటూనే వారి నిర్ణయాన్ని ప్రకటించడంలో మోదీజీ ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా చింతన్ బైఠక్ లోనూ ఒకే దేశం, ఒకే యూనిఫాం అనే కొత్త నినాదాన్నిచ్చారు. అసలా మాటకి వస్తే ఆయనలా మరే రాజకీయ నాయకుడూ దేశంలో ఆలోచించలేరు.. కడు దుర్లభం కూడా. వారిది ఆర్ ఎస్ ఎస్ క్రమశిక్షణ మరి. అందువల్ల మాటయినా, అభిప్రాయాన్న యినా రుద్దడమే తెలుసు. పలకమీద కాదు రాతి మీద శాసనమే. మనమంతా ఒకటే అంటూండడం పరిపాటి. అంతా ఒకటే ఏ విషయంలోనో తెలీదు. ఎందుకంటే కేంద్రానికి రాష్ట్రాలకీ మధ్య అత్తగారు, చిన్న కోడలు, పెద్దకోడల తారతమ్యం చాలా ఉంది. పెద్దామెకు పెద్ద కోడలు పీట వేస్తే, చిన్న కోడలు అరిచి అడిగితే గాని గ్లాసుడు నీళ్లవదట.. అలా ఉంది కేంద్రం, రాష్ట్రాల మధ్య సో కాల్డ్ సంబంధాలు. మనది భిన్నత్వంలో ఏకత్వం.. కానీ ఎక్కడా ఎవ్వరూ సమానత్వం, ఏక కత్వం అనేది పాటించగా చూడం. రాజకీయవాతావరణం అంతగా పరిస్థితులను మలినంచేసేసింది. ప్రతీదీ రాజకీయాల మయం. రాజకీయ కోణంలోనే ఆలోచించడం జరుగుతోంది. మరి ఇప్పుడు మోదీజీ కొత్త పిలుపుని చ్చారు.. ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం అని.
ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలదే అయినప్పటికీ, దీనికి దేశ సమైక్యత, అఖండతలతో కూడా సంబంధం ఉంటుందని చెప్పారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం జరిగిన మేధోమథనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లా డారు. సహకారాత్మక సమాఖ్య తత్వానికి ఈ చింతన్ శిబిరం అసాధారణ ఉదాహరణ అని తెలిపారు. వారి చింతన్ శిబిరంలో ఏది చర్చించినా, నిర్ణయం తీసుకున్నా దేశానికి ఎంతో మేలు చేస్తుందనే అభిప్రాయంలో ప్రకటనలు చేయడం చిత్రం.
రాష్ట్రాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందవచ్చునని, కలిసికట్టుగా భారత దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని తెలిపారు. ఇది రాజ్యాంగ భావన అని, ప్రజల పట్ల మనకు కల కర్తవ్యమని వివరించారు. ఒక దేశం-ఒకే పోలీస్ యూనిఫాం సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్చిం చాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్రాలకే పరిమితం కాదని, నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని తెలిపారు. నేరగాళ్ళు దేశ సరిహద్దుల ఆవలి నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పని చేయవలసిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. ఇది ఉపన్యాసంవరకూ బాగానే ఉంది. కానీ రాష్ట్రాల మధ్య సమన్వయం సరిగా లేన పుడు, వివరాలు, సమాచారాలు ఇచ్చిపుచ్చుకోవడాల్లో రాజకీయ కోణంగా ఆలోచించి జాప్యాలు జరుగు తున్న సమయాల్లో శాంతి భద్రతలు, ప్రజారక్షణ అంశాల్లో కేంద్రం ప్రత్యేకించి ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది. పైగా అన్నింటికీ ముందే నిర్ణయాలు తీసుకుని, అమలు చేయాలన్న చివరి దశలో పోనీ మనోళ్లని ఒకసారి కలిసి మాట్లాడు తామన్న ధోరణే తప్ప జాతీకి ఉపయోగపడే అంశాల మీద రాష్ట్రాల అభిప్రాయాలకు ప్రాధాన్యతనీయడం అవసరం. ీ విషయంలో మరి కేంద్రం ఏ మేరకు నమ్మకం కలిగిస్తోంది. చిత్రమేమంటే, నేరాల విషయంలో పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సమానంగా స్పందన రానంత వరకు, అన్ని రాష్ట్రాలు వీటిపై పోరాటానికి కలిసిరానంత వరకు, వీటిని ఎదుర్కొనడం అసాధ్యమని చెప్పారు.
ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేధోమథనం సదస్సు రెండు రోజులపాటు జరుగుతుంది. అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై విధానాల రూపకల్పనకు జాతీయ దృక్పథాన్ని కల్పించేందుకు చేసే ప్రయత్నమే ఈ సదస్సు. పోలీసు దళాల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మరింత ఎక్కువగా వాడటం, భూ సరిహద్దుల నిర్వహణ, తీర ప్రాంత భద్రత, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్య మంత్రులు, హోం మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్నవారి మాటకు కేంద్రం యిచ్చే ప్రాధాన్యత, గౌరవం మున్ముందు తెలుస్తుంది. హామీలు ఇవ్వడం కంటే వాటిని నిలబెట్టుకోవడం, సహాయసహకారాలు అందించడమే కీలకం. ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య రాజకీయ కోణం అడ్డుపడకూడదు. ప్రజారోగ్యం, ప్రజాసంక్షేమం, రక్షణ విషయాల్లో కూడా పరిస్థితులను అనుసరించి ఏ విధంగా సహాయసహకారాలు అందించాలన్నది ఆలోచించాలి. తనవారు పరాయివారు అన్న తేడాలు ఈ విషయాల్లో లేకుండా ఉంటేనే నిజమైన సామరస్యం ఉంటుంది.