సీఐపై ఎమ్మెల్యే అనుచరుల దాడి! తాడిపత్రిలో హైటెన్షన్
posted on Mar 19, 2021 @ 12:25PM
మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం అధికార పార్టీకి షాక్ తగిలింది. తాడిపత్రి మున్సిపాలిటీపై తెలుగు దేశం పార్టీ జెండా ఎగిరింది. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మెన్ అయ్యారు. జేసీ దెబ్బతో షాకయ్యారు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. మున్సిపల్ ఎన్నికల తాడిపత్రిలో రాజకీయాలు మారిపోయాయి. ఓటమి భారంతో అధికారపార్టీ రెచ్చిపోతోంది. పోలీసులపై దాడి చేస్తున్న ఘటనలు తాడిపత్రిలో చోటు చేసుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. పోలీసులని చూడకుండా.. సీఐ శ్రీరామ్‌పై దాడికి తెగబడ్డారు. తాడిపత్రిలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలులో ఉంది. అయినా ఆ సెక్షన్లు ఎమ్మెల్యే అనుచరులకు వర్తించడంలేదు. సీఐ తప్పు లేకున్నా, ఎమ్మెల్యే అనుచరులు అనవసరంగా జోక్యం చేసుకుని దాడి చేశారని తెలుస్తోంది.
గురువారం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణస్వీకారం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత కల్పించారు. ఆరుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు, 6 వందల మంది పోలీసులు విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటివద్ద ఓడిన కౌన్సిలర్లు, అనుచరులు పెద్దగా ఈలలు, కేకలు వేయడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న అనంతపురం సీఐ శ్రీరామ్ వారిని వారించే ప్రయత్నం చేశారు. దీంతో వారు సీఐతో వాగ్వాదానికి దిగారు. కొందరు వైసీపీ నేతలు సీఐపై దాడికి దిగారని చెబుతున్నారు. సీఐపై ఎమ్మెల్యే అనుచరులు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుసుకున్న డీఎస్పీ చైతన్య హుటాహుటిన అక్కడి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. ఎమ్మెల్యే అనుచరులపై చర్యలుంటాయని హెచ్చరించారు. కానీ వారిపై కేసు నమోదు చేయలేదు. సీఐపై దాడి చేసినా కేసు నమోదు చేయకపోవడంపై తాడిపత్రిలో చర్చ జరుగుతోంది.