బడిలో కరోనా పంజా!
posted on Mar 19, 2021 @ 12:06PM
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. స్కూళ్లు వైరస్ కు హాట్ స్పాట్లుగా మారిపోయాయి. వారం రోజులుగా తెలంగాణలోని స్కూళ్లలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని వేర్వేరుచోట్ల 86 మందికి వైరస్ నిర్ధారణ అయింది. 12 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్ అని తేలింది. నిర్మల్ జిల్లా బైంసా జ్యోతిభాపూలే గురుకుల పాఠశాలల్లో కోవిడ్ కలకలం రేపుతోంది. బుధవారం 9 మంది విద్యార్థులకు పాజిటివ్ రాగా.. గురువారం 25 మంది విద్యార్థులు కరోనాకు గురయ్యారు. హైదరాబాద్, రాజేంద్రనగర్ ఎస్టీ బాలుర హాస్టల్లో 22 మంది విద్యార్థులకు కరోనా నిర్థారణ అయింది. విద్యార్థులతో పాటు వార్డెన్, వాచ్‌మెన్‌కు పాజిటివ్ వచ్చింది. రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులకు వైరస్ సోకింది. కామారెడ్డి జిల్లా, పిట్లం జ్యోతిభాపూలే విద్యాలయంలో 13 మందికి, బాసర ట్రిపుల్ ఐటీలో ముగ్గురికి కరోనా పాజిటీవ్ వచ్చింది.
కొమురంభీం ఆసీఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ఎస్టీ బాలికల వసతి గృహంలో గురువారం 10 మంది డిగ్రీ విద్యార్థినీలకు, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం, ఇందారం జడ్పీ హైస్కూల్లో 7గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయునికి కరోనా సోకింది. సిరిసిల్ల జడ్పీహెచ్ఎస్‌లోని ముగ్గురు ఉపాధ్యాయులకు, కరీంనగర్ డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న ఒకరికి, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, చిన్న గొల్కొండ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు పాజిటీవ్ వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది.
తెలంగాణలో గురువారం కొత్తగా 313 కరోనా పాజీటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,360కి చేరింది. గురువారం ఇద్దరు కరోనా మృతితో చెందడంతో.. ఇప్పటి వరకు మొత్తం 1,664 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2,434 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరిలించాలని సూచిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు డీఎంహెచ్‌వోతో సమీక్షిస్తున్నారు. సరిహద్దు మండలాల్లలో రోజుకు 2వేల వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం అధికారులు 10 సంచార వాహనాలను వినియోగించనున్నారు.