కరోనా వేళ.. వివాదంలో హెల్త్ డైరెక్టర్
posted on Dec 23, 2022 @ 1:40PM
ప్రభుత్వ అధికారులకు కులం ఉంటుంది. మతం ఉంటుంది. వద్దనుకుంటే అది వేరే విషయం. కానీ, వద్దనుకున్నా, ప్రతి ఉద్యోగి, అధికారి కులం, మతంకు సంబందించిన వివరాలన్నీ ప్రభుత్వ రికార్డులలో భద్రంగా ఉంటాయి. అయితే అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్లో కుల, మత విశ్వాసాల ప్రస్తావన చేయడం, కుల, మత వివక్ష చూపడం గానీ చేస్తీ అది నేరం అవుతుంది. మత ప్రచారం చేయడం మరింత పెద్ద నేరం, అపరాధం అవుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. అంతేకాదు, క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందని ఆయన చెప్పారు.ఆఫ్కోర్స్ అది ఆయన వ్యక్తీ గత విశ్వాసం కావచ్చును. కానీ ఆయన ఒక ప్రభుత్వ అధికారి, ఆవిషయం మరిచి పోయి చేసిన వ్యాఖ్య సహజంగానే దుమారం రేపుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిజానికి ఆయన ఒక్క కరోనా గురించి మాత్రమే మాట్లాడి వదిలేయలేదు. ప్రపంచానికి, అభివృద్ధి పాఠాలు నేర్పిందే క్రైస్తవ మతమని మరో వివాదస్పద వ్యాఖ్య చేసారు. అలాగే, ప్రపంచం అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమన్నారు. అలాగే, క్రైస్తవ మత ప్రచారానికి కూడా ఆయన పిలుపు నిచ్చారు. కరోనా నుంచి పూర్తిగా విముక్తి చెందామని, మంచిని ఆచరించాలని..దాని కోసం అందరూ క్రైస్తవ మతాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు.
నిజమే, శ్రీనివాస రావు తమ విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అది కూడా వ్యక్తిగత హోదాలో హాజరైన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పోస్టులో ఉన్న ఆయన, తమ విధుల్లో భాగమైన కరోనా మహమ్మారిని ఏసు ప్రభువు దయతోనే నిరోధించామని చెప్పడం విమర్శలకు దారి తీసింది. నిజానికి శ్రీనివాసరావు మత విశ్వాసాల గురించి పెద్దగా తెలియక పోయినా ఆయనకి రాజకీయ ఆశలు, ఆకాంక్షల గురించి మాత్రం వేరే చెప్పనక్కర లేదు. గతంలోనూ ఆయన పబ్లిక్ లో ముఖ్యమంత్రి కేసేఅర్ కాళ్లు మొక్కి, వివాదాస్పద అధికారిగా వార్తల్లోకి ఎక్కారు. అదొక వివాదం అయితే ఇప్పడు మరో వివాదానికి ఆయన తెర తీశారు. రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువయ్యారు. సోషల్ మీడియాలో అయితే శ్రీనివాస రావును చెరిగి పారేస్తున్నారు.
అంతేకాదు తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లు, వెంకన్న దేవుని పేరు (శ్రీనివాస రావు) పెట్టుకుని క్రైస్తవం పుచ్చుకున్న ఆయనపై, ఇంతకూ ముందు ఏమో కానీ, ఇప్పుడైతే అవినీతి ఆరోపణలు కుడా వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శ్రీనవాసరావు పెద్ద అవినీతి పరుడు అని విమర్శించారు..ప్రజలను ఓ మతానికి చెందిన దేవుడు కాపాడారట. మరి ఆ దేవుడు ఉన్న దేశానికే పో .. అన్నారు. ఓ మతానికి కొమ్ముకాసే అధికారివా అని ప్రశ్నించారు. ఒక్క హాస్పిటల్ లో కూడా శ్రీనివాస్ రావు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయారని బండి ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
అదొకటి అలా ఉంటే, తెలంగాణలో ని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం జరిపించే పలకలపై, క్రిస్మస్ ట్రీ బొమ్మలు వెలిశాయనే విమర్శలు వినవస్తున్నాయి. అలాగే ప్రముఖ సినిమా నటులు,సెలబ్రిటీలు గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రిస్మస్ వేడుకలుజరుపు కోవడం, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం కూడా సమాజంలో మాట విద్వేషాలకు కారణం అవుతోందా ఆనం సందేహాలు వ్యక్తమవుతున్నాయి.