కారు స్పీడ్ కు సైకిల్ బ్రేకేసినట్లేనా?
posted on Dec 23, 2022 @ 1:31PM
అయిపోయింది.. అంతా అయిపోయింది.. కారు పార్టీ దెబ్బకు సైకిల్ పార్టీ డీలా పడిపోయింది.. కేడర్ ఉన్నా.. లీడర్ లేక డల్ అయిపోయింది.. ఇది ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి. కానీ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం వేదికగా నిర్వహించిన శంకారావం సభ... సక్సెస్ కాదు... సూపర్ సక్సెస్ అయింది. దీంతో పసుపు పార్టీ నేతల్లోనే కాదు.. పార్టీ కేడర్‌లో సైతం నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు ఈ సభకు ప్రజలు.. స్వచ్ఛందంగా తరలిరావడం చూసి.. నిన్న మొన్నటి వరకు.. బెల్ బ్రేక్ లేదు.. సైకిల్ ఎక్కడా లేదు అంటూ పసుపు పార్టీపై అవాక్కులు చవాక్కులు పేలిన ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతల నోళ్లకు ఈ సభ విజయవంతం కావడం ద్వారా తాళం పడింది.
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపోందారు. 2019 ఎన్నికల్లో ఇదే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వారిలో చాలా మంది సైకిల్ దిగి.. కారు పార్టీలోకి జంప్ కొట్టి.. కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి పదవులు అందుకొని.. కేసీఆర్ కోటరిలో అత్యంత నమ్మకస్తులుగా మారిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీలో లీడర్ లేకపోవడంతో.. సైకిల్..కిల్ అపోయిందంటూ ఓ చర్చ అయితే తెలంగాణలో అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో వీర విహారం చేసింది. కానీ పార్టీ కేడర్ మాత్రం స్థిర చిత్తంతో స్థిరంగా సైకిల్ పార్టీనే అంటిపెట్టుకొని ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. తెలుగుదేశం కేడర్ మాత్రం అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. దీంతో టీఆర్ఎస్‌లోకి వెళ్లిన మాజీ టీడీపీ నేతలు సైతం అతి సునాయాసంగా గెలవగలుగుతున్నారనే ప్రచారం కారు పార్టీలో నేటికి షికారు అయితే చేస్తోంది.
మరోవైపు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమంటూ ... టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్.. తాజాగా ఆ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చేశారు. దీంతో ఆ పార్టీకి ఆత్మగా ఉన్న తెలంగాణ స్థానంలో భారత్ రావడంతో.. ప్రజలు సైతం ఆ పార్టీపైనే కాదు.. కేసీఆర్ పాలనపైన కూడా.. తమదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నారు.
అయితే ఎన్నికల ప్రచార సమయంలో తప్పించి.. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీపై కేసీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ సైతం విమర్శలు చేసింది లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఖమ్మంలో చంద్రబాబు సభ సక్సెస్ తర్వాత.. ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేయాలనుకొంటున్న గులాబీ బాస్ కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణలో టీడీపీ రాజకీయాలు సాగవంటూ విమర్శించారు. ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నా.. చంద్రడు ఒకడే ఉన్నట్లుగా తెలంగాణలో కేసీఆర్ మాత్రమే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
ఇంకోవైపు.. చంద్రబాబు సభపై కేసీఆర్ బంధువు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శాసన సభా పక్ష కార్యాలయంలో సహచర మంత్రులతో కలసి మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శించారు. చంద్రబాబు పాలనలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురైందని ఆరోపించారు. అంతేకాదు.. ఖమ్మం వేదికపై నుంచి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదీకాక తెలంగాణలో సైకిల్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సభలు, సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు సైతం చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ మహానగరంలో త్వరలో సభ ఉంటుందని తెలుస్తోంది. అలాగే టీడీపీ బలంగా ఉన్న ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో సైతం ఈ సభలు నిర్వహించడం.. అదేవిధంగా టీడీపీలో రాజకీయ జీవితం ఆరంభించిన... ఆ తర్వాత పార్టీలు మారినా... ఫేట్ మారని నేతలను గుర్తించి వారిని సైతం తిరిగి సైకిల్ ఎక్కించుకొని.. సైకిల్ పార్టీని మళ్లీ సూపర్‌గా సవారీ చేయించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి సైకిల్ పార్టీని బలోపేతం చేసి... అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేలా.. పార్టీని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు.