Read more!

ఆరోగ్యం గురించి భయపడితే గుండెజబ్బు ఖాయం


ఆరోగ్యం అనేది ప్రకృతి మనకిచ్చిన వరం. అది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. జన్యుపరమైన కారణాల చేతనో, నానాటికీ తగ్గిపోతున్న రోగనిరోధకశక్తి వలనో ఎప్పుడు ఏ ఆరోగ్య సమస్య ముంచుకువస్తుందో ఊహించడం కష్టం. అలాగని నిరంతరం ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుందేమో అని భయపడితే... ఆ భయం నిజమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

ఓ నార్వే పరిశోధన

నార్వేకు చెందిన డా॥ ఇడెన్ బెర్గ్‌ ఆధ్వర్యంలోని పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 50 ఏళ్లు పైబడిన ఒక ఏడువేలమంది జీవితాలను పరిశీలించారు. వారి అనారోగ్య సమస్యలు, బరువు, రక్తపోటు, అహారపు అలవాట్లు, విద్య... వంటి కీలక వివరాలను సేకరించారు. తిరిగి ఒక 12 ఏళ్ల తరువాత వీరిలో ఎంతమంది గుండెకు సంబంధించి తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొన్నారో చూశారు.

 

జో డర్‌గయా

పరిశోధన కోసం ఎన్నుకొన్న ఏడువేలమందిలో ఒక పదిశాతం మందికి తమ ఆరోగ్యం గురించి అనవసరమైన భయందోళనలు ఉన్నట్లు తేలింది. తరువాత కాలంలో ఇలా భయపడినవారిలోనే గుండెజబ్బులు ఎక్కువగా బయటపడ్డాయి. అది కూడా కాస్తో కూస్తో కాదు... ఇతరులతో పోల్చుకుంటే ఆరోగ్యం గురించి నిరంతరం భయపడేవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం ఏకంగా 70 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
కారణాలు

 

- మనలో ఏదో ఒక అనారోగ్యం ఉందని నిరంతరం ఒత్తిడికి లోనవ్వడం వల్ల మన శరీరంలోని కార్టిసాల్, అడ్రినలిన్‌ వంటి హార్మోనులు గుండె పనితీరు మీద ప్రభావం చూపుతాయి.

 

- అనారోగ్యం గురించి నిత్యం భయపడేవారు వ్యాయామం చేయడం, ఉపవాసం ఉండటం వంటి కఠినమైన పనులకు దూరంగా ఉంటారు. వాటివల్ల తమ సున్నితమైన ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుందని భయపడుతుంటారు.

 

- మానసిక సమస్యలతో బాధపడేవారు, తమ ఆరోగ్యం గురించి కూడా కంగారుపడే అవకాశం ఉంది.

 

- నిరంతరం మనం దేని గురించైతే కంగారుపడతాయో, దాని గురించి అతిగా శ్రద్ధ తీసుకోవడం వల్ల అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఎలాగూ ఉంది.

 

- అనారోగ్యం గురించి కలుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు కొందరు సిగిరెట్లు, కాఫీ, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇవి నిజంగానే గుండెకు చేటు కలిగిస్తాయి.

 

- అనారోగ్యం ఉందన్న భ్రమతో చిన్నచిన్న సమస్యలకి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ, ఏవో ఒక బిళ్లలు మింగుతూ ఉండటం వల్ల కూడా అసలుకే మోసం వస్తుంది.

 

అతి సర్వత్ర వర్జయేత్‌

ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మంచిదే! కానీ నిరంతరం మన శరీరానికి ఏదో ఒక ఉపద్రవం ముంచుకు వస్తుందని భయపడటాన్ని ‘హైపోకాండ్రియా’ అనే మానసిక రోగంగా భావిస్తుంటారు. అందుకని లేనిపోని ఆరోగ్య సమస్యల గురించి ముందుగానే భయపడే బదులు... చక్కటి ఆహారాన్ని తీసుకోవడం, తగిన వ్యాయామం చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడిని అధిగమించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదన్నా అవాంఛిత లక్షణం కనిపించినప్పుడు సకాలంలో వైద్యుని సంప్రదించి, శరీరాన్ని దారికి తెచ్చుకోవాలి. అలా కాకుండా నిరంతరం అనారోగ్యం గురించి భయపడుతూ కూర్చుంటే ప్రతిక్షణమూ నరకంగానే మారుతుంది. చివరికి మన భయమూ నిజమవుతుంది.

 

 

- నిర్జర.