Read more!

ఇవి తింటే పొట్ట తగ్గడం ఖాయం


అదేంటో! మన పెద్దవాళ్లు అన్నిరకాల ఆహారాన్నీ తీసుకునేవారు. కడుపు మాడ్చుకోకుండా శుభ్రంగా తినేవారు. అయినా వాళ్లు మనలాగా ఊబకాయంతో బాధపడేవారు కాదు. మారిపోయిన జీవనశైలి ఇందుకు కారణం కావచ్చు. కానీ ఆహారం విషయంలో స్పష్టత లేకపోవడం కూడా ఓ ముఖ్య కారణం అంటున్నారు. కొన్ని రకాల ఆహారపదార్థాలతో పొట్టతగ్గడం ఖాయమంటున్నారు. అవి ఇవిగో...

 

పాల పదార్థాలు

పాలకి సంబంధించిన ఏ పదార్థంతో అయినా కొవ్వు ఖాయమనీ, కొవ్వుతో ఊబకాయమూ గ్యారెంటీ అన్నది మన భయం. ఇందులో సగం మాత్రమే వాస్తవం ఉంది. పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుందన్న విషయం తెలిసిందే! ఈ కాల్షియం మనలోని కొవ్వు కణాలలోకి చేరి అవి త్వరగా కరిగేలా చేస్తాయని పరిశోధనల్లో తేలింది. పైగా ఇప్పుడు వెన్న తీసిన పాలపదార్థాలు అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి, నిర్భయంగా పాలపదార్థాలను తీసుకోవచ్చు.

 

ఆకుకూరలు

ఇప్పటి ఆహారంలో ఆకుకూరలు మాయమైపోయాయి. వీటిని పచ్చిగానో, లేదా ఆవిరి మీద ఉడికించో తింటేనో కావల్సినన్ని పోషకాలు ఎలాగూ లభిస్తాయి. ఇక ఆకుకూరల్లో పీచుపదార్థం, నీరు ఎక్కువగానూ... కేలరీరు తక్కువగానూ ఉంటాయి. అందుకనే మాంసాహారం తినేవారికంటే తరచూ ఆకుకూరలు తినేవారు తక్కువ బరువు ఉంటారని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.

 

పళ్లరసాలు కాదు పళ్లే!

లోటాలకి లోటాలు పళ్లరసాలు తాగి తెగ ఆరోగ్యం వచ్చేసిందని భ్రమిస్తూ ఉంటాము. నిజానికి పళ్లని తినడంలో పదోవంతు లాభం కూడా పళ్ల రసాల వల్ల కలగదు. కారణం! పళ్లని రసంగా మార్చే క్రమంలో వాటిలోని విటమిన్లు, మినరల్స్‌తో పాటుగా ‘phytonutrients’ అనే పోషకాలు కూడా కొట్టుకుపోతాయట. ఇక పీచు పదార్థాలు అయితే అస్సలు మిగలవు. మిగిలేదల్లా గుప్పెడు చక్కెర పదార్థాలే! అందుకే పళ్లరసాల వల్ల ఊబకాయం, డయాబెటిస్ దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

 

బాదంపప్పులు

బాదంపప్పులు తింటే బరువు పెరిగిపోతామన్నది ఇప్పటి తరానికి ఉన్న భయం. ఇది కూడా అర్థసత్యమే అని తేలిపొయింది. బాదంపప్పులలో ఉండే కొవ్వు వల్ల శరీరానికి చెడుకంటే మంచే ఎక్కువ అని తాజా పరిశోధనల్లో తేలింది. బాదం పప్పులలోని ప్రొటీన్ల వల్ల ఆకలి తగ్గి, చిరుతిళ్ల వైపుగా మనసు పోదట. పైగా ఇది మన శరీరంలోని చెడు కొవ్వుని (LDL Cholesterol) తగ్గిస్తుందనీ, పొట్ట దగ్గర పేరుకుపోయే కొవ్వుని కూడా కరిగిస్తుదనీ చెబుతున్నారు. మన రోజువారి ఆహారంలో కాస్త బాదంపప్పుని కూడా చేర్చుకోమని సూచిస్తున్నారు.

 

పొట్టు తీయని ఆహారం

గోధుమపిండి ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది, బియ్యం ఎంత తెల్లగా ఉంటే అంత నాణ్యమైనవి... లాంటి అభిప్రాయాలకు స్వస్తి పలకాల్సిన సమయం వచ్చేసింది. తెలుపు, మెత్తదనాల మాయలో పడిపోతే మనకు మిగిలేది పిండే! మన శరీరంలో అధికంగా పేరుకుపోయే ఈ పిండిపదార్థాలే సకలరోగాలకూ కారణం అవుతున్నాయి. కాబట్టి ఆహారపదార్థాలను ఎంచుకొనేటప్పుడు అవి వీలైనంత సహజంగా ఉండేలా చూసుకోవాలి. మర తక్కువ పట్టించిన బియ్యాన్నీ, Whole wheat గోధుమపిండినీ, కాస్త గోధుమరంగులో బరకగా ఉండే పంచదారనీ ఎంచుకోవాలి.

 

 

- నిర్జర.