చాణక్యుడు చెప్పిన మాట.. ఇంటి యజమానికి ఈ లక్షణాలుంటే కుటుంబం నాశనమే..!
posted on Jun 11, 2024 @ 9:30AM
ప్రపంచంలోని అన్ని దేశాలలోకి భారతదేశానికి, ఇక్కడి కుటుంబ వ్యవస్థకు చాలా ప్రత్యేకత ఉంటుంది. భారతదేశ కుటుంబంలో తండ్రిని ఇంటి పెద్దగా భావిస్తారు. ప్రతి కుటుంబానికి ఇంటి పెద్దనే మార్గనిర్థేశనం చేస్తాడు. కుటుంబ సభ్యుల మంచి చెడులు ఇంటి పెద్దనే చూసుకుంటాడు. ఎవరికీ ఏ లోటు రాకుండా ఇంటి పెద్దనే అందరి పట్లా బాధ్యతగా ఉంటాడు. ఇంటి పెద్దలో మంచి గుణాలు, అలవాట్లు, మంచి నడవడిక ఉన్నప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ ఇంటి పెద్దకు కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుందట. ఇంతకీ ఇంటి పెద్దకు ఉండకూడని లక్షణాలేంటో తెలుసుకుంటే..
కుటుంబ పెద్ద తన సోదరులతో ఎల్లప్పుడూ మంచి సంబంధాలను కొనసాగించాలట. కుటుంబంలో సోదరభావం ఉంటే కుటుంబం మొత్తం ఒకరికొకరు బలంగా ఉంటారట. ఇది జరగకపోతే, ఇంట్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఆ ఇల్లు ఏ విషయంలోనూ ఐక్య భావంతో ఉండదు. కుటుంబంలో ఎదుగుదల అనేది ఉండదు.
ఇంటి పెద్దలు మొదట నియమాలను పాటించాలి. ఆ తరువాత కుటుంబ సభ్యులను కూడా నియమాలను పాటించమని చెప్పాలి. అప్పుడే అది కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుంది. చాలా సార్లు ఇంట్లో పెద్దలు ప్రతి ఒక్కరికీ నియమాలు, నిబంధనల గురించి చెప్తారు కానీ వాటిని స్వయంగా పాటించరు. అలాంటి ఇంట్లో సంతోషం ఎక్కువ కాలం ఉండదు. అందుకే సభ్యులతో పాటు ఇంటి పెద్దలు కూడా నియమాలను పాటించాలి. కుటుంబ సభ్యులకు స్ఫూర్తిగా ఉండాలి.
ఇంటి పెద్ద ఆహారం వృధా చేస్తే ఆ ఇంట్లో శుభాలు ఆగిపోతాయి. చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఇంట్లోని అన్ని వస్తువుల విలువను ఇంటి పెద్ద అర్థం చేసుకోవాలి. ఆహారం, నీరు, డబ్బు వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
కుటుంబంలో విభేదాలు ఉంటే దానిని పరిష్కరించే బాధ్యత ఇంటి యజమానిపై ఉంటుంది. ఇంటి పెద్ద ఎవరి పట్లా వివక్ష చూపకూడదు. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలను చర్చల ద్వారా ముగించాలి. ఇలా చేయకుంటే అందరిలో విభేదాలు వస్తాయి.
ఇంటి పెద్దలు ఎప్పుడూ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డబ్బు ఖర్చు చేయాలి. పిల్లల భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేయాలి. అనవసరంగా ఖర్చు చేస్తే ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉంటుంది.
*రూపశ్రీ.