Read more!

పోలిక…కారాదు పొలికేక!!

"ఆ పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో ఎంతబాగా చదువుతాడో, నువ్వూ ఉన్నావు. వేలు తగలడేస్తున్నా చదవనే చదవవు. ఏమి చేస్తాం అంతా మా కర్మ" ఒక ఇంట్లో కొడుకుపై ఒక తండ్రి గొంతు ఇది.

"అసలు ఆడపిల్లలా ఉండనే ఉండవు. ఈ చుట్టుపక్కల నీలాంటి అమ్మాయిలు అసలు ఉండరు. నువ్వు ఒక్క పని చేయవు, ఎప్పుడు చూసినా మగరాయుడిలా ఉంటావు. ఏమీ లేకపోయినా ఆ చదువు ఉందని నీకు తెగ పొగరు. చక్కగా ఇంటి పని వంట పని నేర్చుకోమంటే అది ఇదీ చెప్పి ఎగ్గొడుతుంటావు. నువ్వు అడపిల్లగా పుట్టాల్సిన దానివి కాదు" మరొక ఇంట్లో కూతురి మీద  తల్లి ప్రచండ యుద్ధం ఇది.

"అసలు నువ్వెప్పుడైనా నన్ను సుఖపెట్టావా?? సంపాదించడం సరిగా చేతకాదు. బొత్తిగా తెలివిలేని మనిషిని కట్టబెట్టారు మా వాళ్ళు. మా అక్క మొగుడు చూడు ఎంత పని చేస్తాడు, ఎంత తెలివిగా ఉంటాడు, ఎంత బాగా సంపాదిస్తాడు. మా తమ్ముడు నీకంటే, నా కంటే చిన్నోడు అయినా వాడే నయం. పెళ్ళానికి బంగారం తీసాడు, పిల్లల పేరున డిపాజిట్లు వేసాడు. నువ్వూ ఉన్నావు ఎందుకూ" సంసారంలో ఓ భార్య చేతిలో నలిగిపోతున్న భర్త పరిస్థితి ఇది.

నాకు ఈ డ్రెస్ వద్దు, మా క్లాస్మేట్ వేసుకున్న డ్రెస్ బాగుంది అలాంటిది కావాలి" ఓ బుడ్డోడి మొండితనం.

"మా ఫ్రెండ్స్ అందరి దగ్గరా మొబైల్స్ ఉన్నాయి, నాకు తీసివ్వండి లేకపోతే అన్నం తినను" తల్లిదండ్రుల దగ్గర ఓ కూతురి బ్లాక్మైల్.

"వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చాయో, ఒకే స్కూల్, ఒకే తరగతి, ఒకే టీచర్ ను. అయినా నువ్వు ఒట్టి మొద్దు శుంఠవు" ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై మండిపాటు.

పరిస్థితులు, సందర్భాలు, వ్యక్తులు ఇలా అన్నీ వేరు అయినా అక్కడ తొంగిచూసే కారణం 90% పోలిక. ఈ పోలిక ఎలాంటిదంటే సముద్రం ఎంతో ఆహ్లాదంగా ఉన్నా దానిలో దిగితే ఇక గల్లంతు అయిపోయే మనిషిలా, ఆ పొలికకు గురయ్యే మనిషి మనసు అంతే ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. 

ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరొక మనిషికి భిన్నంగా ఉంటాడు, భిన్నంగా ఆలోచిస్తాడు, అట్లాగే జీవన సరళి, దానికి తగ్గ శక్తి సామర్త్యాలు కూడా భిన్నంగా ఉంటాయి.  కాబట్టే మనుషులు చేసే పనులలో బిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరూ దాని గురించి ఆలోచించరు. సాదారణంగా మనిషి సామర్థ్యము 90% అంతర్గతమైనదే. కేవలం 10% మాత్రమే బాహ్య ప్రభావాలకు లోనవుతూ ఉంటుంది. కానీ ఆ పదిశాతం ఏర్పాట్లు సరిగా సమకూర్చి, మిగిలిన తొంభై శాతాన్ని దెబ్బ తీస్తూ ఆ వ్యక్తి సరిగా ఉండటం లేదని పోల్చి చూడటం ఎంత వరకు సమంజసం.

పుటైన దగ్గర నుండి ప్రతి దశలోనూ, ప్రతి విషయంలోనూ ఇలాంటి పోలిక పెళ్లి చూడటం, పోల్చుకోవడమనే వలయంలో పడి, ప్రతి మనిషి తమలో ఉన్న ప్రత్యేకతను చేతులారా కోల్పోతున్నారు అంటే ఆశ్చర్యంగానూ, బాధగానూ ఉంటుంది. ప్రతి మనిషి అంతర్గత శక్తి సామర్త్యాలను గుర్తించుకుని వాటిని క్రమంగా మెరుగుపరుచుకుంటూ ఉంటే ఒకనాటికి ఆ విషయంలో ఎంతో గొప్ప ప్రావీణ్యత పొందిన వారిగా గుర్తింపు పొందగలుగుతారు. 

అంతేకానీ సమాజాన్ని చూస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను చూస్తూ పోల్చుకుని, చేతకాని వాళ్ళలా ఏమీ రాదు అనుకుంటూ  ఉంటే మానసిక సంఘర్షణ ఎక్కువై. చివరకు నిజంగానే చేతకాని వాళ్ళలా మారే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

అందుకే ఎవరినీ ఎవరూ ఇతరులతో పోల్చుకోరాదు, ఎవరినీ ఇతరులతో పోల్చి తక్కువ చేసి చూడరాదు. ప్రపంచంలో ప్రతి వస్తువుకూ దేని ప్రత్యేకత దానికి ఉన్నట్టే మనిషికి కూడా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని వారిదైన జీవితాన్ని ప్రోత్సహిస్తే, ఈ పోలికలు పొలికేకల్లా గందరగోళం సృష్టించవు జీవితాలలో.

◆ వెంకటేష్ పువ్వాడ