దేవుడు ఒక్కడే అనే సందేశాన్ని అందించిన గురునానక్ జయంతి నేడు..!
posted on Nov 15, 2024 @ 9:30AM
దారి తప్పినప్పుడల్లా మనల్ని సన్మార్గంలో నడిపించటానికి గురువు అవసరం. అలాంటి గొప్ప గురువులలో ఒకరైన గురునానక్ జయంతి నేడు. గురునానక్ జయంతి సిక్కులకి అత్యంత ముఖ్యమైన రోజుల్లో ఒకటి. సిక్కుల మొదటి గురువు గురునానక్ జయంతినీ ఒక పండుగలా జరుపుకుంటారు. సిక్కులకే కాకుండా గురునానక్ బోధనలు ప్రజలందరికీ, మతపరంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో విలువలు నేర్పిస్థాయి. ఈ రోజును గురు పురబ్, గురునానక్ ప్రకాశ్ ఉత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుగుతుంది. ఈ సంవత్సరం గురునానక్ 555వ జయంతి జరుపుకుంటున్నారు.
గురునానక్ 1469 లో తల్వండిలో జన్మించి, చిన్న వయస్సులోనే ఆధ్యాత్మికత పట్ల లోతైన ఆసక్తి కనబర్చారు. ఇతరులకి సాయం చేయాలనీ ఆయనకు ఎక్కువగా ఉండేది. భారతదేశంలో ఆధిపత్యం వహించిన కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన సిద్ధాంతం ముందడుగు వేసింది. గురునానక్ స్థాపించిన సిక్కిజం, వినయాన్ని, సేవను, దేవుని పట్ల భక్తిని ప్రోత్సహించే దిశగా సాగింది.
గురునానక్ జయంతి ప్రాముఖ్యత ..
గురునానక్ జయంతి అంటే కేవలం గురునానక్ కు నివాళి కాదు, అది ఆయన బోధనలకు ఇచ్చే గౌరవం. ఇది విశ్వ సోదరభావం, కరుణ, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. సిక్కులకు, గురునానక్ ప్రతిపాదించిన ఏకమతం, భక్తి సూత్రాలను గుర్తు చేస్తుంది. "ఇక్ ఓంకార్" అంటే ఒకే దేవుడు ఉన్నాడు అనేది ఆయన సందేశం. సిక్కిజానికి ఈ సందేశం కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇది అందరికీ అందుబాటులో ఉన్న ఏకదైవవాద దేవుని ఆలోచనను ప్రోత్సహిస్తుంది. ఆయన బోధనలు గురు గ్రంథ్ సాహిబ్‌లో పొందుపరిచారు.
గురునానక్ జయంతి ఎలా జరుపుకుంటారు?
గురునానక్ జయంతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు ప్రజలందరూ గొప్ప ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు. సాధారణంగా ‘అఖండ్ పాఠ్’, అంటే గురు గ్రంథ్ సాహిబ్ నిరంతర 48గంటల పఠనం గురుద్వారలో ప్రారంభమవుతుంది. భక్తులు తెల్లవారుజామున ప్రార్థనలు, ‘నగర కీర్తన’ అని పిలువబడే ఊరేగింపులో పాల్గొంటారు, ఇందులో గురుగ్రంథ్ సాహిబ్‌ని ఒక పల్లకిలో ఉంచి వీధుల్లో తీసుకువెళతారు. ఊరేగింపు సమయంలో కీర్తనలు, సిక్కు యోధులు నిర్వహించే ‘గత్కా’ అనే యోధకళా ప్రదర్శనలు ఉంటాయి.
‘లంగర్’, అంటే ఉచిత సామూహిక భోజనం. ఈ వేడుకలో ఇదే ప్రధాన భాగం. మతం, కులం లేదా లింగం ఇలా ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే లంగర్, గురునానక్ విలువలైన సమానత్వం, సేవా గుణాలను ప్రతిబింబిస్తుంది.
గురు నానక్ బోధనలు..
గురునానక్ బోధనలు సులభంగ ఉంటూనే లోతైన అర్థం కలిసి ఉంటాయి. అన్ని విశ్వాసాల ప్రజలకు సంబంధించినవి. ఆయన బోధనలలో ప్రధానంగా మూడు సూత్రాలు ఉన్నాయి:
దేవుని పేరును జపించడం
‘నిజాయితీగా సంపాదించడం
ఉన్నది ఇతరులకు కొంత పంచడం.
ఇలా.. వినయము, నిజాయితీ, దయతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించారు. ప్రజలంతా దేవుని దృష్టిలో సమానమని, కులం వ్యవస్థ, లింగ వివక్ష వంటివాటిని తిరస్కరించారు.
గురునానక్ బోధనలు ప్రుజలలో దయ, సేవాభావం కలిగి ఉండాలని, దేవుని పట్ల భక్తితో జీవితం గడపాలని మార్గనిర్దేశం చేస్తాయి. గురునానక్ జయంతి మనకు సహనం, దానం, గౌరవించటం వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని చెప్పకనే చెబుతుంది.
*రూపశ్రీ