బాధ్యతల బండిని నడిపే మగమహారాజులకు ఇంటర్నేషనల్ మెన్స్ డే శుభాకాంక్షలు..!
posted on Nov 19, 2024 @ 9:30AM
మగవాడు... ఈ పదం ఏమీ పెద్ద బిరుదు కాదు కానీ, పుట్టిన తర్వాత బాధ్యతగా పెరిగి, తన కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ఉన్నతమార్గంలో నడిపించటానికి పాటుపడుతున్న ప్రతివాడూ మగాడే.. మొనగాడే... అటువంటి వారిని గుర్తించి, వాళ్ళని అలా మార్చే విషయాల గురించి, అలా మారకుండా చేసే విషయాల గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక మగాడు సరిగా లేకపోతే.. అంటే బాధ్యతగా లేకపోతే అతని కుటుంబం, కుటుంబ సభ్యులు మానసికంగానూ, ఆర్థికంగాను, సామాజికంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ప్రతీ సంవత్సరం నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరుపుకుంటున్నారు.
ఈ రోజు పురుషుల శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం. అలాగే సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక, రాజకీయపరంగా వారు చేస్తున్న సేవలను జ్ఞాపకం చేసుకోవడమే లక్ష్యం. పురుషులు సమాజంలో తీసుకొచ్చే మంచి మార్పులని గుర్తు చేసి, వారిని ఆదర్శంగా చూపించే వీలు కల్పించే రోజు ఇది.
పురుషుల భావోద్వేగ స్వేచ్ఛ, పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు వంటి అంశాలపై చర్చలను ప్రోత్సహించడానికి వేదికగా నిలుస్తుంది.
పురుషులు కూడా ఇతరుల మాదిరిగా మామూలు మనుషులేనని, వారికీ బాధ, నిరాశ కలిగినప్పుడు భావోద్వేగ మద్దతు అవసరమే అని సమాజం గుర్తించేలా ప్రేరేపిస్తుంది. సమాజంలో ఎప్పటినుంచో స్థిరపడిపోయిన కొన్ని భావనలు, పురుషులు తమ భావోద్వేగాలను స్వేచ్ఛగా బయటపెట్టనివ్వకుండా చేస్తున్నాయి. ‘మగ పిల్లాడు ఏడవటం ఏంటిరా? చూస్తే నవ్వుతారు’ అంటారు చాలా మంది. దాంతో వాళ్ళు తమ బాధ బయటపెట్టరు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుంది. ఇందుకే మగాళ్ళు చాలా కరుకు స్వభావం కలిగి ఉంటారు అంటారు. ఈ సమస్యలను గుర్తించటం ద్వారా ఇంటర్నేషనల్ మెన్స్ డే మగావారి జీవితంలో మార్పులు తీసుకువస్తుంది.
కుటుంబంలో, వివిధ రంగాల్లో, సమాజంలో పురుషులు అనేక పాత్రలను పోషిస్తారు. కంటికి రెప్పలా కాపాడే తండ్రిలా, మద్దతు ఇచ్చే అన్నగా, నమ్మకమైన స్నేహితుడునిగా, ప్రేమించే భాగస్వామిగా, సమాజంపట్ల బాధ్యత ఉన్న మనిషిగా పురుషులు చుట్టూ ఉన్నవారి కోసమే జీవితాన్ని వెచ్చిస్తారు. ఇంత చేసినా వారి కృషి, త్యాగానికి అంతగా గుర్తించబడవు. మెన్స్ డే ఈ విషయాలను గుర్తించేలా చేస్తుంది.
పురుష దినోత్సవం సందర్భంగా కొన్ని లక్ష్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కొన్ని ప్రధాన లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి..
నైతిక విలువలు, బాధ్యతలు కలిగిన మగవారిని గుర్తించి, వారిని ఆదర్శంగా చూపించడం. ఇలా చేయడం వల్ల మగవారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం సాధ్యం అవుతుంది.
స్త్రీ, పురుషుల మధ్య పరస్పర గౌరవం, సహకారాన్ని ప్రోత్సహించటం. ఇలా చేస్తే ప్రతి మగవాడి నుండి స్త్రీ కి సంరక్షణ, సహాయ సహకారాలు అందుతాయి.
పురుషులు ఎదుర్కొనే సవాళ్లను హైలైట్ చేయడం ప్రధానం. కుటుంబ జీవితంలో, పనిచేసే చోట, బయట సమాజంలో పురుషులు ఎదుర్కొనే ఒత్తిడి, ఇతర అనేక సమస్యల గురించి అవగాహన కల్పించటం. ఇది మగవారిలో నిగూఢంగా దాగున్న శక్తిని, వారి మానసిక స్వభావాన్ని బయటపెడుతుంది.
మన సమాజం పురుషాదిక్యంలా కనపడుతున్నప్పటికీ బాధపడుతున్న, అణచివేయబడుతున్న అమాయకపు పురుషులు కూడా ఉంటారు, చాలాసార్లు తప్పుడు ఆరోపణల వల్ల వాళ్ల జీవితాలనే కోల్పోతుంటారు. అటువంటివారిని కాపాడేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.
ఇంటర్నేషనల్ మెన్స్ డే ప్రధానంగా పురుషుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. గణాంకాల ప్రకారం, పురుషులు తరచుగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. వైద్య సహాయం తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు. అందుకే మెయిన్స్ డే రోజు రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టటం వంటి విషయాలపై చర్చలను ప్రోత్సహిస్తుంది.
ఇంటర్నేషనల్ మెన్స్ డే కేవలం పురుషులకే సంబంధించినది కాదు, ఇది లింగ సమానత్వాన్ని మెరుగుపరచడం, మంచి సంబంధాలను నెలకొల్పడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పరస్పర గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడే పురుషులు, స్త్రీలు కలిసి శాంతి కోసం, ప్రగతి కోసం పనిచేస్తారు.
ప్రతిమగవాడు తనకు ఒక కుటుంబం ఏర్పడ్డాక తన జీవితాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తాడు. కుటుంబ సంతోషమే తన సంతోషం అని అనుకుంటాడు. తల్లి పడే కష్టం పిల్లల కాళ్ళ ముందు కనబడితే తండ్రి కష్టం కనిపించదు. అలా మగవాడి కష్టం బయటకు కనిపించదు. కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం, సమాజం కోసం నిస్వార్థంగా తనను తాను కోల్పోయే మగాళ్ళు ఎప్పుడూ గౌరవించబడాలి. అలాంటి మగ మహారాజులకు అందరికీ హ్యాపీ మెన్స్ డే..!
*రూపశ్రీ