Read more!

ఒక్క ఓటరు.. ఐదుగురు సిబ్బంది

 

 

 

అది కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఆ దట్టమైన అడవిలో 20 కిలో మీటర్లు ప్రయాణం వెళ్తే బనేజ్ అనే ప్రాంతంలో అక్కడో గుడి ఉంది. ఆ గుడికి ఒక పూజారి ఉన్నారు. ఆయన పేరు మహంత్ దర్శన్ దాస్. ఆయన ఉండేది సప్నేశ్ బిల్లియత్ అనే ఊళ్లో. ఆ ఊరు గుజరాత్ లో ఉంది. ఆ ఊరికి ఆయనొక్కడే నివాసి, ఆ పోలింగ్ బూత్ కి ఆయనొక్కడే ఓటరు.

 

ఈ ఒక్కరి కోసం ఒక పోలింగ్ బూత్ ఏర్పాటవుతుంది. ఈ ఒక్క ఓటు వేయించడం కోసం ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు, ఒక ప్యూన్, ఒక పోలీసు అడవిలో ప్రయాణించి వస్తారు. దర్శన్ దాస్ ఓటు వేస్తే అధికారుల డ్యూటీ పూర్తయినట్టే. నిజానికి ఒకప్పుడు బనేజ్ లో 85మంది ఓటర్లు ఉండేవారు. వారంతా అడవిని వదిలిపెట్టి వేరే చోట్లకి వెళ్లిపోయారు. కానీ దర్శన్ దాస్ మాత్రం గుడిని, ఊరిని వదిలిపెట్టలేదు.ఈ బూత్ గుజరాత్ లోని జునాగఢ్ జిల్లాలోని ఉనా నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.



ఇలాంటి బూత్ లు అరుణాచల్ లో కూడా ఉన్నాయి. అక్కడున్న 8 పోలింగ్ బూత్ లలో 3-8 మంది ఓటర్ల చొప్పున ఉంటారు. మరాంబో, అప్పర్ ముడోయిదీప్ పోలింగ్ బూత్ లలో మూడేసి మంది చొప్పున ఓటర్లు ఉంటారు. మాలోగామ్, సికారిడోంగ్ పోలింగ్ బూత్ లలో నలుగురు చొప్పున ఓటర్లుంటారు. లామ్టా అనే బూత్ లో అయిదుగురు, మటక్రాంగ్, ధర్మపూర్ బూత్ లలో ఏడుగురు చొప్పున, పున్లి బూత్ లో తొమ్మిది మంది ఓటర్లు మాత్రమే ఉంటారు.



ఇక్కడకు వెళ్లాలంటే రోడ్లేమీ ఉండవు. వాహనాలు వెళ్లలేవు. కాబట్టి పోలింగ్ సిబ్బంది రెండేసి రోజులు కాలి నడకన ప్రయాణించి పోలింగ్ బూత్ లకు చేరుకుంటారు. పోలింగ్ పూర్తయ్యాక రెండు రోజులు తిరుగుప్రయాణం చేస్తారు. ఈ పోలింగ్ బూత్ లన్నీ చైనా , మయన్మార్ సరిహద్దుల్లో ఉంటాయి.