నీకు హెల్ప్ చేశానుగా.. ప్లీజ్
posted on Mar 21, 2014 @ 4:33PM
జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు తమ గెలుపునకు విశ్వప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే కీలకమైన సర్పంచ్‌లను ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డారు.
‘పంచాయతీ ఎన్నికల్లో నేను మద్దతిచ్చాను. ఇప్పుడు నేను గెలిచేందుకు మద్దతివ్వు. ఓట్లేసి నిన్ను గెలిపించినోళ్లు.. మీమాట వింటారు. వాళ్లతో మాట్లాడి.. నన్ను గెలిపించు’ అంటూ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌లను కోరుతున్నారు. వారి మద్దతు కోసం అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్యాకేజీలు కూడాఇస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది జులైలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎనిమిది నెలల వ్యవధిలో పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎం పీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారై, ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. వేలం పాటల జోలికి వెళ్లినట్లు తెలిస్తే శిక్ష తప్పదని భయపడుతున్నవారు వేరే మార్గాలు వెతికారు. సర్పంచ్‌ల మద్దతు ఉంటే గెలుపు సులభతరం అవుతుందని భావిస్తున్న వారు వారి మద్దతు కోసం నానాపాట్లు పడుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడానికి ముందునుంచే సర్పంచ్‌లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో అభ్యర్థుల నుంచి అధికమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఆర్థికస్థోమత ఎక్కువగా ఉన్న నేతలు తాము గెలిచేందుకు ఎంతైనా వెచ్చించడానికైనా సిద్ధంగా ఉండటంతో పలువురు సర్పంచ్‌ల పంట పండుతోంది. గ్రామాన్ని బట్టి లక్ష రూపాయల నుంచి ఐదులక్షల వరకు ప్యాకేజీ ఇస్తున్నట్లు తెలిసింది.