పవన్ కళ్యాణ్ అరెస్టుకు రంగం సిద్ధం?!
posted on Jul 21, 2023 @ 12:59PM
ఏపీలో ఇప్పుడు రాజకీయం అంతా వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. ఏపీలో మానవ అక్రమ రవాణాకు వాలంటీర్లు కారణమవుతున్నారని వారాహీ రెండో విడత యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 18 వేల మంది మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లు కారణమనేలా పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలు, యువతుల సమాచారాన్ని వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా వాలంటీర్లు తీవ్రంగా స్పందించగా.. అప్పటి నుండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏపీ మహిళా కమిషన్ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపగా.. ప్రభుత్వం కూడా పథకాల లబ్ది దారులకు వాయిస్ కాల్స్ చేసి వాలంటీర్లకు మద్దతు కూడగడుతున్నది.
వాలంటీర్లపై వ్యాఖ్యల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ అప్పటికీ ఇప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తే.. హైదరాబాద్ నానక్ రామ్ గూడలో వాలంటీర్లు సేకరించే డేటా స్టోర్ చేస్తున్నారనే కొత్త అంశం తెర మీదకి తీసుకొచ్చారు. దాంతో ప్రభుత్వంపై అనుమానాలు మరింతగా పెరిగాయి. కాగా, ఇప్పుడు ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వాలంటీర్లను అవమానిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పరువుకు పవన్ వ్యాఖ్యలు భంగం కలిగించేలా ఉన్నాయని వాలంటీర్లు భావిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, వాలంటీర్లపై పవన్ దురుద్దేశ పూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేశారని, వాలంటీర్లలో మహిళలను కించపరిచేలా పవన్ మాట్లాడారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.
ఒకవైపు లీగల్ యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్న జగన్ సర్కార్ పవన్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని భావిస్తూనే.. మరోవైపు పవన్ కళ్యాణ్ అరెస్టుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని సాక్షాత్తూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఢిల్లీ ఎన్డీఏ సమావేశం ముగిసిన అనంతరం తిరిగి వచ్చిన పవన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పవన్.. వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో తనను ప్రాసిక్యూట్ చేయాలని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, జనసేన కార్యాలయానికి ఆ జీవో వచ్చిందని, ఇదే ఆ జీవో అంటూ మీడియా ప్రతినిధులకు పవన్ జీవో కాపీని చూపించారు. వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిస్తూ జీవో నెం.16ను ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఆ జీవో ప్రకారం పవన్ పై సీఆర్పీసీ 199/4 (బి) కింద కేసులు పెట్టేందుకు అవకాశమున్నట్లు తెలుస్తున్నది.
కాగా, జీవో కాపీ మీడియాకి చూపించిన పవన్.. కావాలంటే తనను అరెస్టు చేసుకోవచ్చని, చిత్రవధ కూడా చేసుకోవచ్చని జగన్ కు సవాల్ విసిరారు. దెబ్బలు తినేందుకైనా సిద్ధమన్నారు. జైలుకు వెళ్లేందుకే కాదు తాను దేనికైనా రెడీ అని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా పవన్.. తన అరెస్ట్ కు రంగం సిద్ధం అయినట్టు అర్థమైందని, ఇదే జగన్ ప్రభుత్వ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. తాను ఒకసారి మాట అంటే ఎంత రిస్కుకైనా వెనుకాడనని, జగన్… చెబుతున్నాను కదా.. సై అంటే సై.. రెడీగా ఉన్నాను.. రా.. చూసుకుందాం అని సవాల్ విసిరారు. దీంతో ఈ వ్యవహారంలో నిజంగానే పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారనున్నాయి? ఈ అంశంలో కోర్టులు ఎలా స్పందించనున్నాయన్నది హాట్ టాపిక్ గా మారింది.