స్పీడ్ న్యూస్ 2
posted on Jul 21, 2023 @ 1:06PM
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
11.తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారిని 63వేల 628 మంది భక్తులు దర్శించుకున్నారు. 33 వేల 548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది.
.................................................................................................................................................
కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి మృతి
12. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే చిలుకూరి రామచంద్రారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. రామచంద్రారెడ్డి ఆకస్మిక మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు.
...............................................................................................................................................................
భూ కంపం
13. దేశంలోని మణిపూర్, రాజస్థాన్ లలో శుక్రవారం తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. భూమికి 20 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
.........................................................................................................................................................
పొన్నం ప్రభాకర్ నిరసన గళం
14. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ నిరసన గళం ఎత్తారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన 26 మందితో ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీలో చోటు దక్కక పోవడంతో ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ నైన తనను ఎందుకు విస్మరించారంటూ నిరసన గళం విప్పారు.
....................................................................................................................................................
జైపూర్ లో వరుస భూకంపాలు
15. రాజస్థాన్ రాజధాని జైపూర్ వరుస భూకంపాలతో వణికిపోయింది. ఈ తెల్లవారుజామున 4.09 నుంచి 4.23 గంటల మధ్య భూమి మూడు సార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపాల తీవ్రత 3.1 నుంచి 4.2 మధ్య నమోదైంది. వీటి వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
.................................................................................................................................................
హైకోర్టు న్యాయమూర్తిపై సీజేఐ అసంతృప్తి
16. రైల్లో వసతులు లేక అసౌకర్యానికి లోనైన ఓ హైకోర్టు న్యాయమూర్తి రైల్వే నుంచి వివరణ కోరడంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం కల్పించే సౌకర్యాల ఆధారంగా తమకు ప్రత్యేక హక్కులు ఉన్నట్టు భావించకూడదని సూచించారు.
................................................................................................................................................
రామడుగులో అత్యధిక వర్షపాతం
17. కరీంనగర్ జిల్లా రామడుగులో ఈ ఉదయం 21. 35 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుఅయ్యింది. రాష్ట్రంలో ఇదే అత్యధిక వర్షపాతం. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
.....................................................................................................................................................
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
18. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా జి. కిషన్ రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు.
..................................................................................................................................................
తగ్గేదేలే: పవన్
19. వాలంటీర్ల విషయంలో పవన్ వ్యాఖ్యలపై కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని పవన్ చెబుతున్నారు. వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుంది? అంటూ నిలదీశారు.
.......................................................................................................................................................
విమర్శలు కాదు వ్యవస్థలో లోపాలు సరిదిద్దే యత్నం: పేర్ని నాని
20. తాను వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శించానంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను పేర్నినాని ఖండించారు. తాను సర్కార్ ను విమర్శించలేదనీ, వ్యవస్థల్లో లోపాలు సరిదిద్దే ప్రయత్నం మాత్రమే చేశాననీ వివరణ ఇచ్చారు.
...........................................................................................................................................................
వరద పరిస్థితిపై సీఎస్ శాంతి కుమారి
21. గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రాచలం వద్ద చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
........................................................................................................................................................
ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద వరద
22. భారీ వర్షాల నేపథ్యంలో ఎడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేసారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో, ఆలయ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
......................................................................................................................................................
తెలంగాణకు భారీ వర్ష సూచన
23. తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పేర్కొంది.
..................................................................................................................................................
నేటి నుంచి ఏపీలో ఓటర్ వెరిఫికేషన్
24. ఎన్నికల కమిషన్ ఏపీలో నేటి నుంచి నెల రోజుల పాటు ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వచ్చి ఓటర్ వెరిఫికేష్ చేపడతారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుపై ఆరోపణల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
..................................................................................................................................................
నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్
25. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 12న నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. రాజస్థాన్ లో కూడా అదే తేదీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
...............................................................................................................................................
డీఎస్పీల బదలీలు
26. తెలంగాణలో 51 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 31వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని ఆదేశించడంతో గత పది రోజులుగా రెవెన్యూ, పోలీస్ శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి.
.............................................................................................................................................
సహాయక చర్యల్లో పాల్గొనండి
27. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయ హస్తం అందించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాలలో పిల్లలకు పాలు, ఆహార పదార్థాలు అందించాలన్నారు.
....................................................................................................................................................
ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : హరీష్
28. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలకు వైద్య సేవలలో ఎలాంటి అంతరాయం ఉండకూదన్నారు.
..................................................................................................................................................
రోడ్డుపైనా నాట్లు.. వినూత్న నిరసన
29.జోగులాంబ జిల్లా శల్కాపురం గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారినా పట్టించుకోవడం లేదంటూ ఆ రోడ్డుపైనే నాట్లు వేసి నిరసన తెలిపారు.
.............................................................................................................................................................
ఆర్డినెన్స్ కేసు విస్తృత ధర్మాసనానికి
30. ఢిల్లీ ఆర్డినెన్స్ కేసును సుప్రీం త్రిసభ్య ధర్మాసనం విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేసింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదలీలపై కేంద్రం ఆర్డినెన్స్ ను ఆప్ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.