మంచి ఆహారం అంత మంచిది కాకపోవచ్చు!
posted on Jul 6, 2016 @ 2:48PM
మంచి ఆహారం అంత మంచిది కాకపోవచ్చు!
నలుగురూ నడిచేదారే సవ్యమైనది కాకపోవచ్చు. అందరూ మంచి అని నమ్మేదే నిజం కావాలన్న నియమం ఏదీ లేదు! ఆహారంలో పోషకాల విలువలకి సంబంధించి కూడా ఇదే విషయం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. సాధారణ పౌరులంతా ఆహా ఓహో అనుకునే ఆహారాలలో అంత పటుత్వం ఉందని చెప్పలేమంటున్నారు. ఈ విషయాన్ని రుజువు చేయడం కోసం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఓ పరిశోధనను చేసింది. అదేమిటంటే...
ఆహారంలో పోషక విలువలకు సంబంధించి, అమెరికాలోని ఒక రెండువేల మంది పౌరుల అభిప్రాయాలను సేకరించింది న్యూయార్క్ టైమ్స్! ఒక యాభైకి పౌగా ఆహార పదార్థాల జాబితాను వీరికి అందించి వీటిలో ఏ పదార్థానికి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నారో తెలియచేయమంది. మరోవైపు ఒక 672 మంది పోషకాహార నిపుణులను కూడా సంప్రదించింది. పౌరులకు అందించిన ఆహారపదార్థాల జాబితానే ఈ నిపుణులకు కూడా అందించింది. ఆ జాబితాలో ఉన్న పదార్థాల మీద వారి అభిప్రాయమూ సేకరించింది.
పోషక పదార్థాలకు సంబంధించి ఇటు పౌరులకీ, అటు పోషకాహార నిపుణులకి ఉన్న అభిప్రాయాలలో భూమ్యాకాశాలకు ఉన్నంత వ్యత్యాసం కనిపించింది. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో రకరకాల పప్పులతో రూపొందిస్తున్న ఎనర్జీ బార్స్ (granola bars) అద్భుతమైన పోషకాలను అందిస్తాయని 71 శాతం పౌరులు భావిస్తే, కేవలం 28 శాతం నిపుణులు మాత్రమే ఈ వాదనతో ఏకీభవించారు. దీనికి పూర్తివ్యతిరేకంగా ద్రాక్షసారాయి (Wine) ఆరోగ్యానికి మంచిదని 70 శాతం మంది నిపుణులు అనుకుంటే, కేవలం 52 శాతం పౌరులు మాత్రమే ఈ అభిప్రాయానికి అనుకూలంగా ఉన్నారు. అలాగని అన్ని ఆహారపదార్థాల విషయంలోనూ ఈ వైరుధ్యం కనిపించింది అనుకోవడానికి లేదు. పాప్‌కార్న్, జున్ను, పాలు వంటి పదార్థాలు ఆరోగ్యానికి మంచివని అటు నిపుణులూ, ఇటు పౌరులూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇంతకీ పౌరులు, నిపుణుల అభిప్రాయాల మధ్య ఇంత వైరుధ్యం ఎందుకు తలెత్తినట్లు! అంటే దానికి చాలా కారణాలే చెబుతున్నారు పరిశోధకులు.
- ఆహారపదార్థాలలో పైపైన కనిపించే మెరుగులకి పౌరులు ఆకర్షింపబడతారే కానీ అందులో అంతర్గతంగా ఉన్న అంశాల జోలికి పోరు. ఉదాహరణకు ఎనర్జీ బార్స్‌లో ఉండే పప్పుల గురించి ఆలోచిస్తారే కానీ ఆ చాక్లెట్లని రూపొందించేందుకు వాడే చక్కెర పదార్థాలని పట్టించుకోరు.
- పౌరుల ఆలోచనాతీరు ఎక్కువగా ప్రకటనల వల్ల ప్రభావితం అవుతూ ఉంటుంది. ఉదాహరణకు... నారింజరసం తాగడం వల్ల వెంటనే శక్తి, పోషకాలు కలుగుతాయని తరచూ ప్రకటనలు వస్తే... అది నిజమే కాబోసు అని వారు నమ్మేస్తారు. కానీ అందులో పీచుపదార్థాలు ఉండవనీ, చక్కెర శాతం అధికమనీ నిపుణులు మాత్రమే గుర్తించగలుగుతారు.
- మన రోజువారీ అవసరాలను తీర్చేందుకు ఏఏ పోషకాలు ఏ స్థాయిలో అవసరం అన్న అవగాహన సాధారణ పౌరులకు తక్కువగా ఉంటుంది.
కాబట్టి మనం ఆరోగ్యమైన ఆహారం అనుకునేదో, ప్రకటనల్లో కనిపించే అభిప్రాయాలో నిజం అనుకోవడానికి వీల్లేదని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది. ఏది నిజమైన పోషకాహారమో తెలియాలంటే నిపుణుల మాట వినాలని హెచ్చరిస్తోంది.
- నిర్జర.