ఉప్పు సమస్య మన ఒక్కరిదే కాదు!

 

ఉప్పు తినడం తగ్గించండో... చక్కెరని తక్కువగా వాడండో... ఆరోగ్యాలు పాడైపోతున్నాయో... అని కేవలం మన దేశంలోనే కాదు! ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా సలహాలు వినిపిస్తున్నాయి. ఈ సలహాలను బలపరిచేందుకు రోజుకో నివేదికో, వారానికో పరిశోధనో బయటకు వస్తోంది. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ‘విక్టోరియా విశ్వవిద్యాలయం’ Australia’s Health Tracker పేరిట ఒక నివేదికను జారీచేసింది. ఆ దేశంలో ప్రస్తుత ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, వీటిలో ఎలాంటి మార్పులు రావాలి... తదితర అంశాల మీద కొన్ని గణాంకాలను వెల్లడించింది.

 

- ఈ నివేదిక ప్రకారం 20 కాదు 30 కాదు! దాదాపు 92 శాతం మంది యువత తగిన శారీరిక శ్రమకు దూరంగా ఉంటున్నారంట. ఫలితం! ప్రపంచంలోని ఊబకాయపు జనాభాలో ఆ దేశ యువత ముందుకు దూసుకుపోతోంది.

 

- యువతే కాదు! పిల్లల పరిస్థితీ ఇలాగే ఉంది. ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది. చిరుతిళ్ల ద్వారా దాదాపు 40 శాతం ఆహారాన్ని అధికంగా తీసుకోవడమే దీనికి కారణం అన్న విషయమూ బోధపడింది.

 

- ఇక 17 ఏళ్లు దాటినవారిలో పొగతాగడం, మద్యపానం సేవించడం సహజమైన అలవాటుగా మారిపోయిందట. ఈ మద్యపానపు వ్యసనం ఒకప్పుడు మగవారిలోనే ఉండేదనీ, ఇప్పుడు మద్యాపానానికి సంబంధించిన అనారోగ్యాలతో మహిళలు కూడా ఆసుపత్రుల పాలవుతున్నారనీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 

- మొత్తంగా చూస్తే సగటు ఆస్ట్రేలియావాసి అసలు మోతాదుకంటే 62 శాతం అధికంగా ఉప్పుని తీసుకుంటున్నట్లు తేలింది. పైగా చిరుతిళ్ల ద్వారా శరీరంలోకి పేరుకుంటున్న చక్కెర నిల్వలూ తక్కువేమీ కాదని గణాంకాలు రుజువు చేస్తున్నాయి. వీటన్నింటి ఫలింతంగా రక్తపోటు, గుండెజబ్బులు వంటి సమస్యలకి బలవుతున్నారట!

 

- ఉప్పు, చక్కెరలు అధికంగా తీసుకోవడం; శారీరిక శ్రమ లేని జీవనశైలిని అవలంబించడం కేవలం మధ్య తరగతి, ఉన్నత మధ్యతరగతి వారి సమస్యే కాదంటున్నారు. ఈ నివేదిక ప్రకారం ఆస్ట్రేలియాలోని ఆదిమజాతివారు, పేదవారు కూడా ఆధునిక జీవనవైలిని అవలంబిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు.

 

- పైన పేర్కొన్న వివరాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని... ప్రజల ఆహారపు అలవాట్లలో, మార్పు రావాలని సూచిస్తోంది విక్టోరియా విశ్వవిద్యాలయం. ప్రజల్లో కనుక ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగి ఉప్పు, చక్కెరలను తగ్గించుకుంటూ.... అవసరమైనంతమేరా వ్యాయామం చేస్తూ ఉంటే, 2025 నాటికి దేశ ప్రజల ఆరోగ్యంలో ఖచ్చితమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆశిస్తోంది.ఆ ఆశ నెరవేరాలనే కోరుకుందాం. ఇది కేవలం ఆస్ట్రేలియాలోని పరిస్థితి మాత్రమే కాదనీ, మన దేశపు సమస్య కూడా అని గుర్తిద్దాం!

- నిర్జర.