తల్లీ గోదారీ.. శాంతించవమ్మా
posted on Jul 14, 2022 @ 10:41AM
ప్రకృతి ప్రకోపించింది, గోదావరి కన్నెర్ర చేసింది. వేదంలా కాకుండా ఉగ్రంగా ప్రవహిస్తూ జనాలను బయపెడుతోంది. తల్లి గోదావరి ఉగ్రగోదావరిగా మారింది. గోదావరికి వరద రావడం సహజమే అయినా.. వందేళ్లలో ఈ స్థాయిలో వరద రాలేదనీ, అదీ జులై నెలలో ఈ స్థాయి వరద ఎన్నడూ లేదనీ, ఇది ఊహించని విపత్తనీ అధికారులే కాదు.. గోదావరి తీరాన నివసించే జనమూ అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని నీటి ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉన్నియి. ముఖ్యంగా తెలంగాణాలోని కడెం ప్రాజెక్టులోకి వరద ఉధృతి భయోత్పాతం కల్పించింది. అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టు డ్యామేజ్ అయి ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయన్న ఆందోళన అధికారుల్లోనే కాదు స్థానికుల్లోనూ వ్యక్తమైంది. అయితే అదృష్టవశాత్తూ గురు వారం ఉదయానికి ఉధృతి తగ్గుముఖం పట్టింది.
ప్రమాదకర స్థాయికి చేరిన కడెం ప్రాజెక్ట్ లోకి వరద ఉధృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులకు చేరింది. లెఫ్ట్ కెనాల్‌కు గండి పడటంతో ప్రాజెక్టు కు ముప్పు తప్పింది. అయినప్పటికీ హైటెన్షన్ కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఉదయం 9 గంటలకు నీటి మట్టం 59.40 అడుగులకు చేరింది. 17,58,166 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరింది.
మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో వైపు పెద్దపల్లి జిల్లాలోనూ గోదా వరి వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల వెళ్లే వాహనాలను పోలీసులు గోదావరిఖని బస్టాండ్ వద్ద నిలిపి వేశారు. తెలంగాణ-మహ రాష్ట్ర మధ్య రవాణా నిలిచిపోయింది. లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 22,15,760 క్యూసెక్కులకు చేరుకుంది. సరస్వతి(అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగు వకు విడుదల చేయనున్నారు.
ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 14,77,975 క్యూసెక్కులు. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 8.38 టీఎంసీలకు చేరుకుంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ స్థాయిలో వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్ట్‌లోకి 21760 క్యూసెక్కుల వరద నీటి ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగ ప్రస్తుతం నీటి మట్టం 1397.82 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎం సీలు ఉండగా ప్రస్తుతం నీటి సామర్థ్యం 9.156 టీఎంసీలకు చేరుకుంది.
మూసీ ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 3553.33 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3553.33 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా ప్రస్తుత సామర్థ్యం 638.30 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 2.84 టీఎంసీ లుగా నమోదు అయ్యింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 4,04,041 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు(90 టీఎంసీల)కు గాను ప్రస్తుత నీటి మట్టం 1087.40 అడుగుల(74.506 టీఎంసీలు)కు చేరింది. వరద ఉధృతి నేపథ్యంలో అధికారులు 36 గేట్ల ద్వారా 4,16,934 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జూన్ మొదట నుండి ప్రాజెక్టు లోకి 107.831 టీఎంసీలు వరద చేరింది. మొత్తం ఔట్ ఫ్లో 53.391 టీఎంసీల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో..ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.52 లక్షల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. వదర ప్రవాహం నేపథ్యంలో సాయంత్రానికి మూడ వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ఎఫ్, 5 ఎస్డీఆర్ఎఫ్ లు పాల్గొన్నా యి. అల్లూరి జిల్లాలో 4, అంబేద్కర్ కోనసీమలో 3, ఏలూరులో 2, తూర్పుగోదావరి లో 1, పశ్చిమగోదావరి లో 2 బృందాలు సహా యక చర్యలు చేపట్టారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసు కోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచనలు చేశారు. తుంగభద్ర ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,05,840 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,09,031 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులుగా కాగా, ప్రస్తుతం 1631 అడుగులుగా కొనసాగుతుంది.