జగన్ మకాం మార్చేస్తారా?
posted on Jul 14, 2022 8:09AM
తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అని రాజు అంటే వందిమాగధులు కాదనక చస్తారా? ఏపీలో జగన్ పాలన అలాగే ఉంది. జగన్ ఔనంటే ఔను.. కాదంటే కాదు.. కేబినెట్, అధికార యంత్రాంగం పరిస్థితి అంతే ఇప్పుడు జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఏపీకి రాజధాని లేకండా చేశారన్న విమర్శలను తిప్పి కొట్టడానికి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారంటున్నారు.
ఏకంగా తన మకాం విశాఖకు మార్చేసి అక్కడ నుంచే పాలన సాగించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే ఇందుకు ముహూర్తం కూడా ఫిక్సయిపోయిందని చెబుతున్నాయి. ప్లీనరీ వేదికగా రాష్ట్రంలో 175కు 175అసెంబ్లీ స్థానాలలో విజయమే లక్ష్యంగా పని చేయాలన్న పిలుపు ఇచ్చిన ఆయన ఎన్నికలకు రెడీ అయిపోవాలని శ్రేణులకు చెప్పకనే చెప్పారు. అమరావతిని ఇప్పటికే నిర్వీర్యం చేసిన జగన్ ఇక దాని ఊసు కూడా రాష్ట్రంలో ఎవరూ ఎత్తకుండా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
కోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న జగన్ ఇప్పుడు విశాఖ నుంచి పాలన సాగించేందుకు నిర్ణయించేసుకున్నారు. విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు రెడీ అయిపోయారు. భవనాల అన్వేషణ కూడా సాగిస్తున్నారు. వారంలో ఐదు రోజులు విశాఖ కేంద్రంగా రాష్ట్ర పాలన సాగించేందుకు సర్వం సిద్ధం చేసేశారు. అమరావతి విషయంలో కోర్టు తీర్పు తరువాత నుంచి మూడు రాజధానులు అని జగన్ నోట ఎప్పుడు వచ్చినా జనం దానిని ఓ పెద్ద జోక్ గా తీసుకుంటున్నారు. నవ్వుకుంటున్నారు. అన్ని విధాలుగా పాలనకు అనువుగా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంచిన అమరావతికి దిక్కు లేదు కానీ మూడు రాజధానులా అని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మూడు రాజధానుల పాటను పక్కన పెట్టి విశాఖ కేంద్రంగా పాలన సాగించడం ద్వారా అమరావతి అభివృద్ధిని నిర్వీర్యం చేశానన్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నది ఆయన యోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇందుకు ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ముహూర్తం ఫిక్స్ చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి రైతులకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత నుంచి అమరావతి నుంచి సాధ్యమైనంత త్వరగా (పారి)పోవాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు.
అమరావతి అభివృద్ధి కోసం అంటూ అక్కడి భూములను అమ్మకానికి పెట్టి, చంద్రబాబు హయాంలో నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వడానికి నిర్ణయించేసి.. సాధ్యమైనంత సొమ్ము దండుకుని.. కోర్టు తీర్పు అమలు చేస్తున్నామని చెబుతూనే ఆ పనులు నత్తనడకన సాగిస్తూ.. కర్నూలు న్యాయరాజధాని అన్న మాట ఎత్తకుండానే.. పాలనా రాజధానిగా తాను మొదటి నుంచీ చెబుతున్న విశాఖ కేంద్రంగా పాలన సాగించాలని జగన్ నిర్ణయానికి వచ్చేశారని అంటున్నారు. అమరావతిలో కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి చిన్నచిన్న పనులు చేస్తూ.. జగన్ తన మకాం విశాఖకు మార్చేయనున్నారని పార్టీ శ్రేణుల నుంచి అందిన సమాచారం.
అయితే పాలనా రాజధాని అని విశాఖకు మకాం మారిస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురౌతాయన్న భయంతోనే క్యాంపు కార్యాలయం పేర కొత్త నాటకానికి తెరతీశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మకాం విశాఖకు మారిస్తే అందరి దృష్టినీ ప్రజా సమస్యల నుంచి మళ్లించే అవకాశం ఉంటుందనీ, విపక్షాలు, ప్రజలూ కూడా విశాఖ నుంచి పాలన అన్న విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తారనీ, రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చనీయాంశంగా మారుతుందనీ, పాలనా వైఫల్యాలపై విమర్శల దాడి ఆగిపోతుందనీ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.