వారంలో గ్రేటర్ నోటిఫికేషన్! జోరుగా పార్టీల ఆకర్ష్
posted on Nov 7, 2020 @ 1:15PM
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన దుబ్బాక ఉప ఎన్నిక ముగియడంతో ఇప్పడు పార్టీలన్ని గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ చేశాయి. వారం రోజుల్లోనే గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో నేతలు దూకుడు పెంచారు. జీహెచ్ఎంసీపై తమ పార్టీ జెండా పాతేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గ్రేటర్ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం ఎంతా వేగంగా చర్యలు తీసుకుంటుందో అంతకంటే వేగంగా .. అధికారం కోసం పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. దీంతో బల్దియాలో ఇప్పుడు జంపింగుల పర్వం జోరందుకుంది. అన్ని పార్టీలు ఆకర్ష్ ఆపరేషన్ చేపట్టడంతో నేతల వలసలు ఊపందుకున్నాయి.
రెండోసారి గ్రేటర్ హైదరాబాద్ పై పాగా వేయాలని భావిస్తున్న అధికార పార్టీ చాలా రోజుల క్రితమే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లో సిటీ నేతలు ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే గ్రేటర్ లో తమను ఢీకొట్టేందుకు తహతహలాడుతున్న కమలం పార్టీకి.. ఝలక్ ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ తన వ్యూహాలకు పదునుపెట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నికల నోటిపికేష్ కు ముందే బీజేపీని సిటీలో బలహీనం చేయాలని కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. నగరంలో కీలక బిజేపి నేతలను కారు ఎక్కించేలా ఆయన మంత్రాంగం జరుపుతున్నారని చెబుతున్నారు. కేటీఆర్ ప్లాన్ లో భాగంగానే జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్ శ్రీధర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారని చెబుతున్నారు. శ్రీధర్ రెడ్డి బాటలో పలువురు గ్రేటర్ కమలం నేతలు కూడా క్యూలో ఉన్నారని గులాబీ నేతలు చెబుతున్నారు.
గ్రేటర్ లో ఈసారి సెంచరీ కొడతామని చెబుతున్న కేటీఆర్.. తమకు ప్రధాన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్న బిజేపిని టార్గెట్ చేశారని చెబుతున్నారు. బీజేపీకి సరైన అభ్యర్థులే దొరకకుండా చేయాలని సిటీ టిఆర్ఎస్ కీలక నేతలకు కేటీఆర్ టాస్క్ ఇచ్చారని చర్చ జరుగుతోంది. కేటీఆర్ అదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు నగరంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు యాక్షన్ లోకి దిగారని చెబుతున్నారు. బండి సంజయ్ బీజేపీ పగ్గాలు చేపట్టాక నగరంలోని కొందరు నేతలకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారం ఉంది. అలాంటి నేతలందరిని టీఆర్ఎస్ లో చేర్పించేలా అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ అసంతృప్త నేతలందరితో మాట్లాడుతూ వారిని కారెక్కించే పనుల్లో టిఆర్ఎస్ సీనియర్లు బిజీగా ఉన్నారని చెబుతున్నారు.
బీజేపీ కూడా కారుకు కౌంటర్ గా స్పీడ్ పెంచింది. సిటీలోని టీఆర్ఎస్ నేతలను పెద్ద ఎత్తున పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది. గతంలో టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్ గా గెలిచిన వారిలో చాలా మంది ఆపార్టీ లో అసంతృప్తిగా ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యేతో విభేదాలతో కొందరు, పార్టీలోని మరో గ్రూపుతో పడక మరికొందరు గులాబీ కార్పొరేటర్లు సైలెంటుగా ఉన్నారని గుర్తించిన బీజేపీ పెద్దలు.. వారందరిని తమ పార్టీలోకి తీసుకొచ్చేలా చర్చలు జరుపుతున్నారని సమాచారం. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. మరికొందరు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కీలక నేతలు కూడా త్వరలోనే కమలం గూటికి చేరుతారంటున్నారు. కోర్ సిటీలో ఇలాంటి చేరికలు ఎక్కువగా ఉంసటాయని గ్రేటర్ కమలం నేతలు చెబుతున్నారు.
మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే , హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనింకా అధికారికంగా ప్రకటించలేదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఆయనకు విభేదాలు ఉన్నాయని, కచ్చితంగా ఆయన టీఆర్ఎస్ నుంచి బయటికి వెళుతారనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుత కార్పొరేటర్లలో కొందరికి టీఆర్ఎస్ పార్టీ ఈసారి టికెట్లు ఇవ్వకపోవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో అధికార పార్టీ టికెట్ నిరాకరించిన నేతలంతా తమ పార్టీలోకి వస్తారని గ్రేటర్ కమలం నేతలు అశిస్తున్నారు.
ఇక గ్రేటర్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర పార్టీల్లోని బలమైన నేతలకు వల వేస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అధికార పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవడం కష్టమని భావిస్తున్న చాలా మంది నేతలు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారని నగరంలోని హస్తం నేతలు చెబుతున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ పరిధిలోనే 45 డివిజన్లు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలను రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్దమంటూ అన్ని పార్టీలకు చెందిన నేతలతో తమతో టచ్ లోకి వచ్చారని పీసీసీ నేతలు చెబుతున్నారు. ఎంఐఎంపై గతంలో ఎప్పుడు లేనంత వ్యతిరేకత ఓల్డ్ సిటీలో కనిపిస్తుందని, తమ కొంత వర్కవుట్ చేస్తే పాతబస్తీలోనూ మంచి ఫలితాలు వస్తాయని గ్రేటర కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతున్నారు.
మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై అన్ని పార్టీలు పోకస్ చేయడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. నేతల వలసలతో పార్టీ కార్యాలయాల్లోనూ సందడి నెలకొంటుంది. రాబోయే రోజుల్లో జంపింగులు మరింత జోరుగా ఉంటాయని, ఎన్నికల నాటికి ఎవరూ ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి ఉంటుందనే చర్చ జరుగుతోంది.