ఏపీలో కలకలం రేపుతున్న ఫేక్ ఆధార్ కార్డులు..
posted on Nov 9, 2020 @ 6:46PM
ఏపీలో ఫేక్ ఆధార్ కార్డు తయారు చేస్తున్న ముఠా అరెస్టు తీవ్ర కలకలం రేపుతోంది. ఆధార్ కార్డులలో టాంపరింగ్ ద్వారా ప్రభుత్వ పథకాల్లో అనర్హులకు లబ్ధి చేకూర్చే విధంగా ఒక ముఠా పనిచేస్తున్నట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. కృష్ణ జిల్లా గుడివాడ, తిరువూరులలో ఆధార్ కార్డును ట్యాంపరింగ్ చేస్తున్నట్టు గుర్తించామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వీరు అక్రమాలకు పాల్పడుతున్నట్టు జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. వీరు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయమై జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ.. ఫేక్ ఆధార్ కార్డు తయారీ కేసులో జిల్లాలోని ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, ఇంకా కొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని ఎస్పీ ప్రకటించారు. ఒక్కొక్క నకిలీ ఆధార్ కార్డు కోసం వీరు రూ. 5 వేలు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒక ఆధార్ సెంటర్ నిర్వాహకుడు, అతడికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ప్రకటించారు. అంతేకాకుండా వారి వద్ద నుండి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.