వైకాపా ఎమ్మెల్యే దుర్భాషలాడడంతో మహిళా వాలంటీర్ ఆత్మహత్య యత్నం..
posted on Nov 9, 2020 @ 6:46PM
ఏపీలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన పి. గన్నవరం ఎమ్మెల్యే అవమానించారని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. సీఎం జగన్ గతంలో చేసిన పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంలో వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నేడు మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పర్యటన చేపట్టారు. అయితే మామిడికుదురు మండలంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నందుకు ఓ మహిళా వాలంటీర్‌ను అందరి ముందు దుర్బాషలాడారు. కొన్ని వందల మంది ప్రజల సమక్షంలో ఆ వాలంటీర్ ను బూతులు తిట్టారు. దీంతో ఆమె తీవ్ర అవమానంతో పురుగులు మందుతాగి.. ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచిత ప్రవర్తనపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కనీసం మహిళ అని గౌరవం కూడా లేకుండా అందరి ముందు వాలంటీర్ ను దుర్భాషలాడడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా గత కొద్దీ రోజులుగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అటు అధికారులు, ఇటు సామాన్య ప్రజల పైన విపరీతంగా రెచ్చిపోతున్నారు. మొన్న ఎమ్మెల్యే శ్రీదేవి ఓ సీఐను నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. నిన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఓ అధికారిని పట్టుకుని, చెప్పు తెగేదాకా కొడతా... నీ ఇష్టమొచ్చినట్లు ఇసుక తరలిస్తే నీ అంతు చూస్తా.. అంటూ ఊగిపోయారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలను సామాన్య ప్రజలు ఏవగించుకుంటున్నారు.