పెన్నా వరదలో చిక్కుకున్న పేకాటరాయుళ్లు!

పోలీసుల కళ్లు కప్పి చతుర్ముఖపారాయణంలో మునిగిపోయిన పేకాటరాయుళ్లు వరదలో చిక్కుకుని హాహాకారాలు చేసిన సంఘటన నెల్లూరులో జరిగింది. ఏ పోలీసుల కళ్లు కప్పి అయితే పేకాట ఆడుతున్నారో.. ఆ పోలీసులే రిస్క్ ఆపరేషన్ చేసి మరీ వారిని రక్షించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెడితే  నెల్లూరు పెన్నానది బైపాస్ వంతెన ఫిల్లర్ ల కింద లైట్లు ఏర్పాటు చేసుకుని మరీ పేకాట ఆడుతున్న పదిహేను మంది జూదరులు ఒక్కసారిగా వచ్చిన పెన్నా నదీ ప్రవాహంలో చిక్కుకున్నారు.

సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నానదికి వరద పోటెత్తింది. దీంతో బైపాస్ వంతెన ఫిల్లర్ల కింద పేకాటలో మునిగిపోయి ఉన్న పేకాట రాయుళ్లు ఆ వరదలో చిక్కుకున్నారు. గంటగంటకూ వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాణభయంతో హాహాకారాలు చేశారు.

ఎలాగైనా తమను రక్షించమని కోరుతూ తెలిసిన వారికి ఫోన్ల మీద ఫోన్లు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బ్రిడ్జిపైనుంచి నిచ్చెన సాయంతో ఒక్కొక్కిగా పేకాటరాయుళ్లు 15 మందినీ రక్షించారు. పోలీసులు ఇంతటి రిస్క్ ఆపరేషన్ చేసి ఉండకపోతే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. పోలీసుల సహసాన్ని అభినందిస్తున్నారు.  

డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు… రాజకీయ వర్గాల్లో కలకలం

  డ్రగ్స్ వినియోగం కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నార్సింగి పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించిన సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుధీర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నార్సింగి ప్రాంతంలో అనుమానాస్పద కదలికలపై సమాచారం అందడంతో ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో సుధీర్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి వారిద్దరిని పట్టుకున్నారు. పోలీసులు ఆ ఇద్దరికీ డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడిన వ్యక్తులను శిక్షించడమే కాకుండా, పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో సుధీర్ రెడ్డిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకు న్నారు? డ్రగ్స్ కి సంబంధించి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా, సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ వినియోగం కేసుల్లో దొరికినట్లు సమా చారం.  సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డట్టు సమాచారం. అప్పట్లో హెచ్చరికలు, కౌన్సెలింగ్ ఇచ్చినా, మళ్లీ అదే బాటలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కొంతకాలంగా కుటుంబ సమస్యలతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని, అదే డ్రగ్స్ వినియోగానికి దారితీసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పోలీసులు ‘చట్టం ముందు అందరూ సమానమే’ అన్న సందేశాన్ని స్పష్టంగా ఇస్తున్నారు.ఈ ఘటనతో డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. పూర్తి విచారణ అనంతరం కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.  

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

  జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ టిమీండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రాగా పేసర్ మహమ్మద్ షమీకి మాత్రం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్‌కు ఎట్టకేలకు శనివారం బీసీసీఐ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది.  గతేడాది అక్టోబర్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్‌కు తీవ్రమైన గాయమైంది. దీంతో తర్వాత జరిగిన మ్యాచ్‌లకు అయ్యర్ దూరమయ్యాడు. డిసెంబర్ 25న (CoE)లో చేరిన శ్రేయస్.. స్ట్రెంత్‌ అండ్ కండీషనింగ్‌లో పురోగతి సాధించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో నాలుగు సెషన్లపాటు కఠినమైన సాధన పూర్తి చేశాడు. మ్యాచ్ సిమ్యులేషన్‌ సెషన్స్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత తుది జట్టు ఇదే.. శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.  

మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం...అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్

  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శాసన సభలో ప్రకటించారు. గతంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఏపీ రోజుకు 13 టీఎంసీలు తీసుకెళ్లేలా తమ ప్రాజెక్టును విస్తరించుకుందన్నారు. 34 శాతం నీళ్లు చాలని  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతకాలు చేయడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.  కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పేర్కొన్నారు. ఈ విషయంలో వాళ్లేదో గొప్పగా చేసినట్లు, మేము ఏదో తప్పు చేసినట్లు  బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని..గత ప్రభుత్వం కంటే మేము సమర్థవంతంగా నీటి హక్కులను కాపాడుతూ వస్తున్నామని తెలిపారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ రావకపోవడం దురదృష్టకరమని మంత్రి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది గత ప్రభుత్వమే ఉత్తమ్ చెప్పారు.  

బళ్లారి కాల్పుల వివాదం...ఎస్పీ ఆత్మహత్యాయత్నం

  కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గాల మధ్య వివాదం తలెత్తంది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యడిని చేస్తూ బళ్లారి ఎస్పీని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై  ఎస్పీ తుమకూరు జిల్లా శిరా తాలూకాలోని తన ఫామ్ హౌస్‌లో నిద్రమాత్రలు మింగి ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం.   బళ్లారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎమ్మెల్యే వర్గీయులు  జనవరి 1, 2026న ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఘర్షణపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ,  బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర గోడవ చోటుచేసుకుంది. ఈ గొడవ ముదిరి రాళ్లు రువ్వుకోవడం, చివరకు కాల్పుల వరకు దారితీసింది. ఈ కాల్పుల్లో రాజశేఖర్ రెడ్డి అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడంతో బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   ఈ కాల్పుల ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపిం ది. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు తదితరులపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. పోలీసులు ఈ కేసులో ఇప్పటికే 40 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బళ్లారిలో హై టెన్షన్ మొదలైంది

న్యూయర్ రాష్ట్రానికి ఘనమైన ఆరంభం : సీఎం చంద్రబాబు

  పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నివేదికలో వెల్లడించింది. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు శుభావార్త అని, కొత్త సంవత్సరానికి ఘనమైన ఆరంభమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ముందు చూపుతో కూడిన విధాన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినేస్ కార్యక్రమాల ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు.  2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి (ఏప్రిల్-డిసెంబర్ 2025) దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో ఏపీ ఏకంగా 25.3 శాతం వాటాను దక్కించుకుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా తన తాజా ఆర్థిక నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ మేరకు ఫోర్బ్స్ బిజినెస్ మేగజైన్ ఓ కథనం వెలువరించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, ఈ తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒడిశా (13.1 శాతం), మహారాష్ట్ర (12.8 శాతం) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో 51.2 శాతం వాటాను ఆకర్షించడం గమనార్హం.

వెనిజులాపై అమెరికా బాంబు దాడులు

వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా ఆ దేశంపై బాంబు దాడులకు దిగింది.  వెనిజులా రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుఝామున ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించడం ఆ దేశ వాసుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఆ క్రమంలో దేశంలో ఎమెర్జన్సీ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.  సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనిజులా వెల్లడించింది.  దాంతో సైనిక స్థావరాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. దాడులు జరిగిన ప్రదేశాల్లో పరిస్థితిని సమీక్షించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దాడులతో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ దాడులకు ముందు అమెరికా విమానయాన సంస్థలకు యూఎస్ పెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసింది. అమెరికా విమానాలు వెనిజులా గగనతలాన్ని వినియోగించవద్దని హెచ్చరించింది. తాజా పరిణామాలపై కొలంబియా ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  వెనిజులా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ఆ ముఠాలతో నికోలస్ మదుకోకు కూడా సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపి స్తుండటంతో.. అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా బలగాలు, యుద్దనౌకలు, సబ్‌మెరైన్లు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మొహరించింది.

బంగ్లా క్రికెటర్‌ని పక్కనపెట్టమని బీసీసీఐ ఆదేశాలు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, హత్యలకు సంబంధించి పెద్ద కలకలమే రేగుతోంది. హిందువులపై వరుస దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు మాస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌ మినీవేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.2 కోట్లకు దక్కించుకోవడంపై  తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాంతో బీసీసీఐ రెహమాన్‌ను రిలీజ్ చేయాలని తాజాగా కేకేఆర్‌కు ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ నిర్ణయంతో బీసీసీఐ బంగ్లాదేశ్ లో క్రికెట్ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంచితే.. ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా ప్లేయర్లపై నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వివాదంపై ఎట్టకేలకు బీసీసీఐ వర్గాలు స్పందించాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిరోధించడానికి చర్యలు చేపట్టినట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 15న అబుదాబీలో జరిగింది. ఇందులో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా ముస్తాఫిజుర్ రికార్డు సృష్టించాడు. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుండటంతో అతడిని ఐపీఎల్ నుంచి నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దాంతో అతన్ని రిలీజ్ చేయాలని బీసీసీఐ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ముస్తాఫిజుర్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. 8.13 ఎకానమీతో సమర్థవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతడు, అనంతరం ముంబై ఇండియన్స్ , రాజస్థాన్ రాయల్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ , చెన్నై సూపర్‌కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 60 మ్చాచ్‌లు ఆడి 65 వికెట్లు తీసుకున్నాడు. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడంతో సీఎస్కే అతడిని విడుదల చేసింది.  మరోవైపు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్టు ఆడే సిరీస్‌లపై ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలోనూ భారత్‌తో షెడ్యూల్ ప్రకటించింది. భారత్‌తో ఆగస్టు - సెప్టెంబరు మధ్య మూడు వన్డేలు, మూడు టీ 20 సిరీస్‌లు ఆడనున్నట్లు తెలిపింది. గత ఏడాది రెండు జట్ల మధ్య సిరీస్‌లు జరగాల్సి ఉండగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా నిరవధికంగా వాయిదా వేశారు. ఈ ఆగస్టు టూర్‌తో ఆ లోటు భర్తీ అవుతుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశాభావంతో ఉంది. అయితే ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహ మాన్ ను పక్కన పెట్టేయాలన్న బీసీసీఐ   తాజా నిర్ణయంతో  టీమ్‌ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య క్రికెట్ సంబంధాల కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది.  

పంచాయితీ భయంతో కట్టుకున్న వాడినే కడతేర్చింది!

 అక్రమ సంబంధం బయటపడకూడదని కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. ఈ ఢటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వామి, మౌనికలకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే మౌనిక తనకన్నా వయస్సులో చిన్న వాడైన సంపత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం  ఏర్పరుచుకుంది. విషయం తెలిసిన భర్త స్వామి పలుమార్లు ఆమెను తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. ఫలితం లేకపోవడంతో  గ్రామ పెద్దలు, బంధువుల ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో విషయం తెలిసిన మౌనిక తన బండారం నలుగురికీ తెలిసిపోతుందన్న భయంతో భర్త హత్యకు పథకం పన్నింది.  ఈ నేపథ్యంలోనే గత నెల 22న ఇంట్లో భర్త నిద్రపోతుండగా.. ప్రియుడు సంపత్ ను ఇంటికి పిలిచింది. ప్లాన్ ప్రకారం ఇరువురూ కలిసి స్వామి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని నేరెళ్ల కుంటలో పడేశారు.  మద్యం మత్తులో చెరువులో పడి చనిపోయాడు కట్టుకథ అల్లి అందర్నీ నమ్మించాలని ప్రయత్నించిన మౌనికకు స్వామి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో మౌనిక నేరం ఒప్పుకుంది. ఆమెను, ఆమె ప్రియుడు సంపత్ ను పోలీసులు అరెస్టు చేశారు.  

డమ్మీ గన్ తో బెదరించి..గొడ్డలితో దాడి చేసి బంగారం దోపిడీ!

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో ఓ జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఇద్దరు దుండగులు డమ్మీ గన్‌తో బెదిరించి, షాప్ యజమానిపై గొడ్డలితో దాడి చేసి నాలుగు తులల బంగారం దోచుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన షాప్ యజమాని సందీప్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.  రాంపల్లి, ఘట్‌కేసర్ ప్రధాన రహదారిపై సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్  షాప్‌కు శుక్రవారం సాయంత్రం సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. సాధారణ కొను గోలుదారుల మాదిరిగా షాప్‌లోకి ప్రవేశించిన వారు. కొద్దిసేపటికి ఒక్కసారిగా తమ వద్ద ఉన్న టాయ్ గన్ తో  షాప్ యజమాని సందీప్ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. అనంతరం షాప్‌లో ఉన్న బంగారు బాక్స్‌లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించిన సందీప్ ధైర్యంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులలో ఒకడు తన వద్ద ఉన్న గొడ్డలి లాంటి పదునైన ఆయుధంతో సందీప్ తలపై బలంగా దాడి చేశాడు. ఒక్కసారిగా జరిగిన దాడిలో  సందీప్ తీవ్రంగా గాయపడి రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగులు   నాలుగు తులల బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. ఓనర్ తీవ్రంగా ప్రతిఘటిం చడంతో వారు ఉపయో గించిన డమ్మీ గన్‌ను అక్కడే వదిలేసి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.అరుపులు, గట్టి గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు లోపలికి వచ్చి చూడగా.. సందీప్ రక్తం మడుగులో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు  కీసర పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని  సందీప్‌ను తక్షణమే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.   కాగా దోపిడీ జరిగిన షాప్ పరిసరాలను, దుండగులు ప్రవేశించిన మార్గాలను పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు.  నిందితులు వదిలేసిన డమ్మీ గన్‌తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. షాప్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు. దుండగుల్ని పట్టుకునేందుకు ఎస్‌వోటీతో పాటు స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ దోపిడీ ఘటనతో నాగారం, కీసర పరిధిలోని వ్యాపార వర్గాలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. ముఖ్యంగా జ్యువెలరీ షాప్‌ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే ఇలాంటి ఘటన జరగడం కలవరపెడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సమష్టిగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి!

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అత్యంత మహిమాన్వితుడైన ఆంజనేయ స్వామి ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదన్న ఆయన.. కొండగట్టు ఆంజనేయస్వామివారి సేవ చేసుకోవడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.  పవన్ కళ్యాణ్   శనివారం (జనవరి 3)  కొండగట్టు  ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.  2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన అనంతరం అప్పట్లో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం   35.19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంలో  నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి పవన్ కల్యాణ్ శనివారం (జనవరి 3) శంకుస్థాపన చేశారు.  కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సమష్టిగా సాకారం చేద్దామని పిలుపు ఇచ్చారు.   రామభక్తులు తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదన్న ఆయన  త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానన్న ఆయన.. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందిం చినందుకు ఆనందంగా ఉందన్నారు.  అంతకు ముందు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్ కు వేదపండితులు శాస్త్రోక్తంగా  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణకు మార్గాన్ని సాకారం చేయాలని, అందుకు తానే స్వయంగా వచ్చి కరసేన వేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీటీడీ చైర్మన్   బీఆర్ నాయుడు, చొప్పదండి ఎమ్మెల్యే  మేడిపల్లి సత్యం, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ పిడుగు హరిప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, దేవాదాయశాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్  సత్యప్రసాద్, టీటీడీ బోర్టు సభ్యులు ఆనందసాయి,  మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ శంకర్ గౌడ్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్  కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.