అనిల్ కుమార్ యాదవ్ మెడకు మరో వివాదం
posted on Jun 30, 2023 @ 4:05PM
వివాదాలు ఆయనను చుట్టుముడతాయో.. ఆయనే వివాదాలను ఆహ్వానిస్తారో తెలియదు కానీ వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాత్రం నిత్యం వివాదాలలోనే ఉంటారు. ఆయన మాట్లాడితే వివాదం, మౌనంగా ఉంటే వివాదం అన్నట్లుగా ఆయన తీరు, వ్యవహారశైలి ఉంటుంది. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకొన్నారు. నెల్లూరు నగరంలో మళ్లీ తన సత్తా చాటు కొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో అనిల్ మరో వివాదంలో చిక్కుకోవడంతో ఆయన అనుచరవర్గంలో వర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది. వివరాల్లోకి వెడితే..
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అపర్ణ సెరెన్ అపార్ట్‌మెంట్ వద్ద.. భద్రత సిబ్బందితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు ఆయన అనుచరులు ఘర్షణకు దిగి.. వారిపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్బంగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్.. సైలెంట్ అయిపోయారనీ... ఆ క్రమంలో ఆయన చుట్టు ఉన్న వారంతా.. ఆయన బాబాయి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ వర్గంలోకి వెళ్లిపోయారని... దీంతో అనిల్ ఒంటరిగా మిగిలిపోయారని చెబుతున్నారు. అయితే మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. యాక్టివ్ అయ్యేందుకు అనిల్ కుమార్ యాదవ్ .. రంగం సిద్దం చేసుకొంటున్నారని... అందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రపై వరుస విమర్శలు గుప్పిస్తున్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి వేళ.. అటు అనిల్ కుమార్ యాదవ్, ఇటు నారా లోకేష్ ఇరువురి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకొంటున్నాయని నెటిజన్లు ఈ సందర్బంగా వివరిస్తున్నారు.
అదీకాక.. రానున్న ఎన్నికల్లో అనిల్ కుమార్‌కు సీటు ఇచ్చేందుకు ఫ్యాన్ పార్టీ అధినేత, సీఎం జగన్ సంకోచిస్తున్నారని.. అందుకే ఆయన బాబాయి రూప్ కుమార్‌ను తెరపైకి తీసుకు వచ్చి.. ఆయనతో రాజకీయం చేస్తున్నారనే ఓ చర్చ సైతం సింహపూరి జిల్లాలో ఇప్పటికే కొనసాగుతోంది.
మంత్రిగా ఉన్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్.. ప్రతిపక్ష పార్టీల నేతలు, అధినేతలపై సవాళ్లు విసురుతూ.. తొడలు గొడుతూ, మీసాలు మెలేస్తూ సవాళ్లు విసిరేవారనీ, అయితే తన మంత్రిపదవిని ఊడబెరికిన జగన్ అదే జిల్లాకు చెందిన కాకాణి గోవర్దన్ రెడ్డికి ఆమాత్య పదవి కట్టబెట్టడం అనిల్ కుమార్ యాదవ్‌కు మింగుడు పడలేదనీ అంటారు. అలాంటి వేళ అప్పట్లో చోటు చేసుకున్న వరుస పరిణామాలు అందరికీ తెలిసినవేనని.. ఆ తర్వాత స్తబ్ధుగా మారిన ఆయన ఇటీవలే మళ్లీ యాక్టివ్ అయి.. చెలరేగిపోతున్న సమయంలో.. ఇలా హైదరాబాద్‌లో వాహనాల పార్కింగ్ విషయంలో సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగి.. దాడి చేయడాన్ని చూస్తుంటే.. అనిల్ కుమార్ యాదవ్‌లో ప్రస్ట్రేషన్ పీక్స్‌కి చేరిందన్న ప్రచారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జోరందుకోంది.
ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్‌ను ఆ పార్టీ అధినేత జగన్ నుంచి తెచ్చుకొని.. ముచ్చటగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలుస్తారా? లేకుంటే తన బాబాయిని రంగంలోకి దింపితే.. ఆయనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తారా? లేదా స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిస్తారా అన్న సింహపురి ప్రజల్లో జోరుగా సాగుతోంది. ఇక నెల్లూరు నగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పి.నారాయణ పేరు దాదాపు ఖరారు అయిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో.. నెల్లూరు వైసీపీ అభ్యర్థి అబ్బాయి అనిల్ కుమార్ యాదవా లేకుంటే బాబాయి రూప్ కుమార్ యాదవా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే.. జగన్ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని, వైనాట్ 175 సమీక్షా సమావేశాల్లో క్లియర్ కట్‌గా స్పష్టం చేస్తున్న విషయం విదితమే.