అమ్మకానికి ఇంజనీరింగ్ కళాశాలలు
posted on Apr 18, 2012 @ 11:31AM
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. రాష్ట్రంలో సుమారు 11వందల మండలాలు ఉండగా 847 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనుసరించిన ఉదారవాద విధానాల కారణంగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దేశవ్యాప్తంగా సుమారు 3,300 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా, మన రాష్ట్రంలోనే 847 కళాశాలలున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ కళాశాలల్లో దాదాపు 70శాతం సరైన వసతులు, ఫ్యాకల్టీ లేక ఇబ్బంది పడుతున్నాయి. వీటిలో చేరేందుకు విద్యార్థులు ఏమాత్రం ఆసక్తి చూపటంలేదు. ఈ ఏడాది ఈ కళాశాలల్లో మొత్తం మూడున్నర లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. కానీ, సుమారు లక్షా 70వేల సీట్లు భర్తీ కాకపోవచ్చునని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో కోర్సులు నిలిపివేశారు. మరికొన్ని కళాశాలలను అమ్మకానికి పెట్టారు. కొన్ని కళాశాలల్లో 50 శాతం కూడా సీట్లు నిండటం లేదని, కొన్ని కోర్సుల్లో నలుగురైదుగురు కూడా చేరటం లేదని అందువల్ల తమకు నిర్వాహణ వ్యయం రాకపోగా, నష్టాలు వస్తున్నాయని ఇంజనీరింగ్ కళాశాల సంఘం ప్రతినిధి ఒకరు తెలుగువన్.కామ్ ప్రతినిధితో చెప్పారు. నష్టాలు ఏటేటా పెరిగిపోవడంతో ఈ ఏడాది దాదాపు 40 కళాశాలలు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.