చంద్రబాబుకు జేజేలు.. జగన్ కు ఛీచీలు!

చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది. బెజవాడ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుంది.  నగరానికి నలుమూలలా ఉన్న చిట్టినగర్, భవానీపురం, రామవరప్పాడు, సుందరయ్య నగర్, రామలింగేశ్వరనగర్, యనమలకుదురు  ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. ఇటువంటి విపత్తు బెజవాడ ప్రజలకు కొత్తేమో కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాదు..  విశాఖ నగరాన్ని హుద్ హుద్ తుపాను మంచెత్తిన సమయంలోనూ, అంతకు ముందు కోనసీమను ఉప్పెన ముంచేసిన సమయంలోనూ చంద్రబాబు గంటల వ్యవధిలో బాధితుల చెంతకు చేరి వారికి ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. బాధితులకు భరోసా కల్పిస్తూ, వారిలో ధైర్యం నింపుతూ వారు పూర్తిగా తేరుకునే వరకూ, చివరి బాధితుడిని కూడా ఆదుకునేంత వరకూ అక్కడే మకాం వేసి పరిస్థితి కుదుటపడిన తర్వాతే వెనుదిరిగారు. ఇప్పుడు ఆ సంఘటనలకు బెజవాడ జనం గుర్తు చేసుకుంటూ, తమకేం ఢోకా లేదన్న ధైర్యంతో ఉన్నారు.

ముఖ్యంగా హుద్ హుద్ తుపాన్ విశాఖను అతలాకుతలం చేసింది. పచ్చదనాన్ని మాయం చేసింది. భారీ వృక్షాలను కూల్చేసింది. సమాచార వ్యవస్థను నాశనం చేసేసింది. రాకాసి గాలులు ప్రళయం సృష్టించాయి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ధ్వంసమైపోయింది. అలాంటి విశాఖను రోజుల వ్యవధిలోనే సాధారణ స్థితికి తీసుకు వచ్చారు. విద్యుత్ సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా అధికారులను పరుగులెత్తించారు. కూలిన సెల్ టవర్ల కారణంగా సమాచార వ్యవస్థ స్తంభించిపోతే.. 24 గంటల వ్యవధిలో పునరుద్ధరించారు. అప్పుడు కూడా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం విశాఖ చేరుకుని బాధితులకు అండగా నిలిచారు చంద్రబాబు. రోజుల తరబడి విశాఖలోనే మకాం వేసి.. బస్సులోనే విశ్రాంతి తీసుకుంటూ, అలుపెరుగకుండా పని చేశారు. విశాఖను నిలబెట్టారు.

ఇప్పుడు వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరానికి, వరద బాధితులకు కొండంత అండగా నేనున్నానంటూ నిలబడ్డారు. 74 ఏళ్ల వయస్సులోనూ రేయింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ, బాధితుల్లో ధైర్యం నింపుతున్నారు.  వరద ఉధృతి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన క్షణం నుంచి చంద్రబాబు ఫీల్డ్ లోకి దిగారు, అర్థరాతరి అపరాత్రి అన్న తేడా లేకుండా వరద ప్రభావిత ప్రాంతాలలో బోటులో తిరుగుతూ  సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధితుల్లో ధైర్యం నింపారు.  బెజవాడలో వరద ఉధృతికి భయపడి అధికారులే బాధితులను చేరుకోవడానికి వెనకడుగు వేస్తున్న తరుణంలో చంద్రబాబు స్వయంగా వరద నీటిలోకి దిగి ప్రజలకు అభయం ఇవ్వడం జనంలో ధైర్యాన్ని నింపింది. దీంతో అధికారులూ అనివార్యంగా ముందుకు వచ్చి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 74 ఏళ్ల వయస్సులో పాతికేళ్ల కుర్రాడిలా నిరంతరాయంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ ప్రజలకు అండగా చంద్రబాబు ఉన్నారు.  

అయితే 2024 మార్చి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి,  ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ మాత్రం బాధితుల వద్దకు వెళ్లి వెకిలి నవ్వులతో ప్రభుత్వంపై , చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఇంతకీ ఆయన వరద ప్రభావిత ప్రాంతాలలో చేసిన పర్యటన వ్యవధి కేవలం అరగంట మాత్రమే. ఆ అరగంటా కూడా చిరునవ్వులు, ప్రభుత్వంపై విషపూరిత విమర్శలు వినా బాధితులకు ధైర్యం చెప్పిన పాపాన పోలేదు. దీంతో జగన్ తీరును చీదరించుకున్న జనం ఆయనను పట్టించుకోలేదు. పైగా తమకు ప్రభుత్వం నుంచి సహాయం అందుతోందని ముఖం మీదే చేప్పేసి చంద్రబాబుకు జేజేలు పలికారు.