కత్తెర గాటు లేని ‘అమరావతి ఫైల్స్’ మీకోసం!
posted on Sep 3, 2024 @ 2:56PM
ఐదేళ్ళ జగన్ అరాచక పాలనలో అన్యాయానికి గురైన అమరావతి రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా భాను దర్శకత్వంలో ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ ‘అమరావతి ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించారు. సినిమా నిర్మాణమంటేనే కత్తిమీద సాములాంటిది. అలాంటిది అప్పటి అధికార పార్టీకి వ్యతిరేకంగా, అధికార పార్టీ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా ఒక సినిమాని నిర్మించాలంటే ఎంత కష్టమైన విషయమో ఊహించవచ్చు. ‘అమరావతి ఫైల్స్’ సినిమా నిర్మాణానికి జగన్ ప్రభుత్వం మొదటి నుంచీ ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసింది. జగన్ సైకో ప్రభుత్వం అమరావతి రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ‘అమరావతి ఫైల్స్’ సినిమా నిర్మాణం విషయంలో కూడా అన్ని ఇబ్బందులు పెట్టింది. ఈ సినిమా నిర్మాణాన్ని ఆపించడానికి ఎన్నో అనైతిక దారుల్లో ప్రయత్నించింది. అయినప్పటికీ నిర్మాత కంఠంనేని రవిశంకర్ ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా సినిమా నిర్మాణాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేశారు. అమరావతి ప్రాంత రైతుల అంతరాత్మను ఆవిష్కరించే విధంగా అద్భుతంగా రూపొందిన ‘అమరావతి ఫైల్స్’ చిత్రానికి సెన్సార్ సమయంలోనూ, విడుదల సమయంలోనూ జగన్ ప్రభుత్వం సమస్యలు సృష్టించింది. అనేక కతెర గాటులకు చిత్రాన్ని గురిచేసింది. టైటిల్ విషయంలో కూడా అభ్యంతరం లేవనెత్తింది. అమరావతి రాజధాని ప్రాంత రైతుల గుండె చప్పుడుగా రూపొందిన ఈ చిత్రానికి ‘అమరావతి ఫైల్స్’ అనే టైటిల్ వుండకూదంటూ సైకో జగన్ ప్రభుత్వం పట్టుబట్టింది. ఈ విషయంలో కంఠంనేని రవిశంకర్ ఎంతో పోరాటం చేశారు. అయితే రాజుకంటే మూర్ఖుడు చాలా బలవంతుడు అంటారు. అప్పట్లో రాజు కూడా సాక్షాత్తూ మూర్ఖుడే. దాంతో ఈ సినిమా టైటిల్‌కి ‘రాజధాని ఫైల్స్’గా మార్చక తప్పలేదు.
ఇక విడుదల సమయంలో కూడా జగన్ చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాకి మంచి థియేటర్లు దొరక్కుండా చేశారు. ఒక దశలో విడుదల ఆపడానికి కూడా ప్రయత్నించారు. అయితే, నిర్మాత కంఠంనేని రవిశంకర్ మడమతిప్పని పోరాటం చేసి విడుదల చేశారు. ‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలయ్యాక సంతృప్తికరమైన ప్రేక్షకాదరణను ఈ సినిమా సొంతం చేసుకుంది. కమర్షికల్ లెక్కల సంగతి అలా వుంచితే, ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని, అమరావతి రైతుల ఆవేదనను సరైన సమయంలో సరైన రీతిలో ఆవిష్కరించారనే అభినందనలు భారీ స్థాయిలో అందాయి. నిర్మాత కంఠంనేని రవిశంకర్ ఈ సినిమాని మట్టి మీద అభిమానంతో నిర్మించారే తప్ప, మనీ ఆశించి కాదు. ‘రాజధాని ఫైల్స్’ కోసం తాను ఖర్చుపెట్టిన డబ్బుని నేలతల్లి కోసం ఖర్చు పెట్టినట్టుగా ఆయన భావించారు. థియేటర్ల ద్వారా ప్రజలకు చేరువైన ‘రాజధాని ఫైల్స్’ ఆ తర్వాత యూట్యూబ్ మాధ్యమం ద్వారా ప్రతి తెలుగు గడపనూ పలకరించింది. ప్రతి తెలుగువాడి చేతితో కరచాలనం చేసింది.
అమరావతి రాజధాని విషయంలో జగన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో ఈ సినిమా ప్రజల ముందుకు చాలా ప్రభావవంతంగా తీసుకెళ్ళింది. 2024లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకుపోవడానికి దోహదం చేసిన అనేక అంశాలలో ‘రాజధాని ఫైల్స్’ సినిమా కలిగించిన ప్రభావం కూడా ఒకటి అనే ప్రశంసలు అందాయి. ఆ విధంగా ఎంతో శ్రమించిన నిర్మించిన ఈ సినిమా ప్రయోజనం నెరవేరినట్టు అయింది. మట్టిమనుషులను అవమానించిన జగన్ నోట మట్టి కొట్టడానికి నిర్మాత కంఠంనేని రవిశంకర్ చేసిన కృషి ఫలించింది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రాక్షస పాలన లేదు. ఇంతకాలం అంధకారంలో వున్న రాజధాని అమరావతి ఇప్పుడు మళ్ళీ రెక్కలు విప్పుతోంది. అంతర్జాతీయ స్థాయికి ఎగరడానికి, ఎదగడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బలవంతంగా పేరు మార్పిడికి, కత్తెర గాటుకి గురైన ‘అమరావతి ఫైల్స్’ చిత్రం కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి ‘రాజధాని ఫైల్స్’ అని కాకుండా ‘అమరావతి ఫైల్స్’ పేరుతో తెలుగు ప్రజల ముందు సగర్వంగా, సగౌరవంగా నిలబడింది. కత్తెర గాటుకి గురికాని ‘అమరావతి ఫైల్స్’ పూర్తి నిడివి చిత్రం ‘తెలుగువన్’ యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులకు అందుబాటులో వుంది. అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని చరిత్రలో నిలిపేలా చేసి, చరిత్ర సృష్టించిన ‘అమరావతి ఫైల్స్’ మీ అభినందనలు అందుకోవడానికి యూట్యూబ్‌లో ఎదురుచూస్తోంది.