మోదీ.. గోబ్యాక్.. హ్యాష్ ట్యాగ్ వైరల్
posted on Nov 1, 2022 @ 2:58PM
అందరికీ ప్రాంతీయాభిమానం ఉంటుంది. కానీ తమ ప్రాంతమే దేశంలో అన్నింటా ముందుందని, అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం వహిస్తోందని, అసలు గుజరాత్ నే రోల్ మోడల్ గా చేసుకుంటే దేశంలో అన్ని రాష్ట్రాలు ముందంజలో నిలుస్తాయని బీజేపీ సర్కారు చేసుకున్న, చేసుకుంటున్న ప్రచారం అంతా యింతా కాదు. పరిశ్రమలు, వాణిజ్యం, పాడిపంటలూ అన్నింటా గుజరాత్ కళకళలాడుతోందని తుంబురా పట్టి దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసుకోవడం, ఆ మాటకు వస్తే ప్రతీ ప్రసంగంలోనూ గుజరాత్ మాట లేకుండా ప్రసంగాన్ని ముగించకపోవడం బీజేపీ వారిని మించినవారు లేరు. అదంతా ప్రధాని నరేంద్రమోదీవారి చలవేననీ బాహాటంగా చెప్పుకోవడం బీజేపీ వారికి చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే పచ్చబొట్లు వేసుకునేంత. చిత్రమేమంటే అంతటి గుజరాత్ మహాద్భుతంలోనే మొన్న పాతకాలం నాటి బ్రిడ్జ్ అమాంతం కూలిపోయింది. మరణించినవారి సంఖ్యా 140కి మించే ఉంటుంది. దీన్ని గురించి మాత్రం కమలనాథులు కంటితుడుపు మాటలే చెబుతున్నారుగాని గట్టిగా ఏమీ మాట్లాడ లేకపోతున్నారు.
గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ మొన్నఅమాంతం కూలి సుమారు 180 మంది గాయపడగా, సుమారు 150 మంది మరణించారని తెలిసింది. బ్రిటీష్ కాలంనాటి బ్రిడ్జ్ ని ఇటీవలే కొంత ఆధునీకరించారట. చాలా రోజులకు మళ్లీ అవకాశం వచ్చిందని పర్యాటకులు వెళితే కొంతసేపటికే కూలిపోయింది. కారణం మాత్రం బ్రిడ్జి మీద అల్లరిమూకలు బ్రిడ్జ్ ని ఉయ్యాల్లా ఊపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు చెబుతున్నారు. పోనీ అదే నిజమనుకున్నప్పటికీ అంత దానికే కూలిపోతుందా? మరి ఆధునీకరణ పనుల మాటేమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కేవలం భజన చేయడమే కాకుండా బ్రిడ్జి పనులు సక్రమంగా జరిగినదీ లేనిదీ పరిశీలించకుండానే పర్యాటకులను అనుమతించడంలో అర్ధమేమిటి అని పరిశీలకుల మాట.
ఇప్పుడు గుజరాత్ పరిస్థితిని గ్రహించి సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మొన్న రాజస్థాన్ పర్యటనలో ఉన్నా మనసంతా గుజరాత్ సంఘటన గురించే మదన పడుతోందని ప్రధాని అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. కానీ సోషల్ మీడియా అంతటా అందరూ గో బ్యాక్ మోదీ అనే భారీ నినాదాలు చేస్తున్నారు ముందు మీ రాష్ఠ్రాన్ని కాపాడుకోండి అంటూ ట్విటర్లలో నినాదాలు ట్రండ్ అవుతున్నాయి.