నడకలోని నిజాలివి
posted on Oct 21, 2019 @ 9:30AM
* నడక శరీరంలో ఎముకలు, కండరాలకు మెదడుతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. నడకే కదా అని నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా శరీరంలోని కండరాలు తరిగిపోతాయి. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నడిచే అలవాటు లేనివాళ్ళ శరీరంలో నిత్యం ఉపయోగించగలిగే కీళ్ళ సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అంటే ఎక్కువశాతం కీళ్ళు బిగుసుకుపోతాయి.
* బరువు తగ్గాలనుకునేవారు నడకకి వెళ్ళేముందు ఏమీ తినకూడదు. ఎందుకంటే, ఓ ముప్ఫై నిమిషాలపాటు నెమ్మదిగా నడవటానికి కావలసిన శక్తి కార్బోహైడ్రేట్స్ నుంచి 45 శాతం, కొవ్వు నుంచి 65 శాతం విడుదలవుతుంది. అంటే నడుస్తుంటే మరింత శక్తి కావాలన్న సంకేతం అందుకున్న శరీరం కొవ్వు నిల్వల్ని కరిగిస్తుంది అన్నమాట.
* నడక మంచిది అన్నారు కదా అని మొదలుపెడుతూనే వేగంగా నడవకూడదు. మొదట 5 - 10 నిమిషాలపాటు నెమ్మదిగా నడవాలి. ఎందుకంటే ఏ వ్యాయామానికైనా కాసేపటికీ ముందు నుంచీ శరీరాన్ని సిద్ధం చేయాల్సి వుంటుంది. నెమ్మదిగా వేగాన్ని పెంచుతూ వెళ్ళాలి. ఎంత వేగంగా నడవాలీ అంటే, నడుస్తూ కూడా మాట్లాడటానికి ఇబ్బంది పడనంత వేగం మంచింది. అలాగే నడక ముగించేటప్పుడు కూడా నెమ్మది నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తూ రిలాక్సింగ్‌గా నడక ముగించాలి.
* నిజానికి నడకతోపాటు కొన్ని వేరే వ్యాయామాలూ శరీరానికి అవసరం. ఎందుకంటే, నడక కొన్ని కండరాలపై ఎక్కువగానూ, కొన్ని కండరాలపై తక్కువగానూ ఒత్తిడి పడేట్ట చేస్తుంది. అందుకని వారంలో ఐదురోజులు నడిస్తే, రెండు రోజులు మీకు నచ్చిన వ్యాయామాలను చేయండి. ఈత, యోగా, ఏరోబిక్స్, జిమ్ ఇలా...
* రోజూ నడిచే అలవాటు వున్నవారికి గుండె, మెదడుకి సంబంధించిన ఇబ్బందులు 10 నుంచి 20 సంవత్సరాల పాటు వాయిదా పడితీరతాయి అంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.
* ఎంతసేపు నడవాలి? దీనికి పరిమితి లేదు. 24 గంటల్లో కనీసం 24 నిమిషాలు అన్నది సూత్రం. కాబట్టి 24 నిమిషాలకు తగ్గకుండా వీలునుబట్టి, ఆరోగ్యాన్నిబట్టి ఆ సమయాన్ని పెంచుకోవచ్చు. క్యాలరీలు ఖర్చుకావాలని నడిచేవారు మాత్రం ఎంత దూరం నడిస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయన్న విషయాన్ని తెలుసుకుని నడక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి.
* ఇక ఒకసారి నడవటం మొదలుపెట్టాక 12 వారాలపాటు అయినా కొనసాగించాలి. రెండు రోజులో మూడు రోజులో నడిచి మానేస్తే ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా వుంటాయట.
* చివరిగా ఒక్కమాట... క్రమం తప్పకుండా మూడు నాలుగు నెలలపాటు నడిస్తే ఎండార్ఫిన్లు విడుదలై మనసుకు ఆనందాన్నిస్తాయి. ఇక అప్పుడు మానేద్దామన్నా మానలేరు. కాబట్టి ఒక్క నాలుగు నెలలపాటు ఓపికపట్టి నడిచారంటే ఇక ఆ తర్వాత ఆ నడకే మిమ్మల్ని ముందుకు నడిపించుకుని వెళ్తుంది.
-రమ