సూక్ష్మ వ్యాయామాలతో వెన్నునెప్పి నుంచి మోక్షం
posted on Nov 7, 2017 @ 2:27PM
నడుం నెప్పి ఒకోసారి ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే, రోజువారి పనులు కూడా చేయలేక, ఇతరులపై ఆధారపడేంతగా మనల్ని అసహాయులని చేస్తుంది. ప్రతీ పదిమందిలో ఏడుగురు నడుం నెప్పి బాధితులే అంటున్నారు వైద్యులు. అయితే చిన్న చిన్న జాగ్రత్తలతో ఈ నడుం నెప్పి నుంచి తప్పించుకోవచ్చని కూడా చెబుతున్నారు.
* ఏ కదలికా లేకుండా ఒకేచోట కూర్చుని వుంటే నడుం నెప్పి వచ్చే అవకాశాలు ఎక్కువట. వెన్నెముకకి ఎలాంటి కదలికలు లేక క్రమంగా బిగుసుకుపోవటమే అందుకు కారణం.
* వెన్నెముకకి బలం రావాలంటే రోజూ కొన్ని చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే చాలుట. వెన్నెముక, పొట్ట చుట్టూ వుండే కండరాలు, పక్కటెముకల చుట్టూ వుండే కండరాలకు ఆ వ్యాయామం అందితే వెన్ను గట్టిపడి నడుం నెప్పి వచ్చే అవకాశమే వుండదు అంటున్నారు వైద్య నిపుణులు.
* ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా రోజూ ఓ 20 నిమిషాల పాటు ఈ కింద చెప్పే వ్యాయామాలు చేయగలిగింతే బావుంటుంది.
1. ఓ కుర్చీలో కూర్చుని నేలకు పాదాలను ఆనించండి.
2. ఎదురుగా వున్న టేబుల్ అంచుల దగ్గర చేతుల్ని వుంచాలి.
3. శరీరాన్ని వెనక్కి వంచి, మళ్ళీ ముందుకు తేవాలి. అంటే ఓ విధంగా శరీరాన్ని సాగదీస్తూ ముందుకు, వెనక్కి కదల డం. ఆ స్థితిలోభారమంతా చేతులపై పడేలా చూసుకోవాలి.
4. గోడకి అభిముఖంగా నిలబడి, రెండు చేతుల్ని భుజాల ఎత్తులో గోడకి ఆనించాలి. పాదాల వేళ్ళపై పైకి లేస్తూ, కిందకి దించాలి. ఇలా చేసేటప్పుడు వెన్నెముకను నిటారుగా వుంచడం ముఖ్యం.
నడుం నెప్పి వున్నప్పుడు వైద్యుల సలహా లేనిదే ఏ వ్యాయామమూ చేయకూడదు. సమస్య తీవ్రత తగ్గాక అప్పుడు చిన్నపాటి కదలికలతో మొదలుపెట్టి క్రమంగా వ్యాయామాల స్థాయి పెంచుకుంటూ వెళ్ళాలి.
మనం నిటారుగా నిలబడాలంటే వెన్ను గట్టిగా వుండాల్సిందే. అలా వుండాలంటే మనం రోజూ వ్యాయామం చేయక తప్పదు. సమస్య రాకముందే జాగ్రత్త పడితే మంచిదే కదా. ఇప్పటి మన జీవనశైలిలో రోజంతా కుర్చీకే అతుక్కుపోక తప్పడం లేదు. మరి అలాంటప్పడు మధ్య మధ్యలో పైన చెప్పిన వ్యాయామాల లాంటివి ఆఫీసులో కూడా చేస్తూ వెన్నుదన్నుగా వుంటుంది. ఏమంటారు?