రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యం కొనసాగేనా ...?
posted on Apr 18, 2012 @ 11:33AM
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కొనసాగుతుందనే విషయాన్నీ ఎట్టకేలకు ఆ సామాజికవర్గ నేతలు అంగీకరించడం ఇతర సామాజికవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ కారణంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం ప్రాధాన్యత తగ్గిపోతుందని కొంతమంది రెడ్డి సామాజికవర్గ నేతలు భావిస్తుండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి "రెడ్డి'' అయివుండి కూడా తన సత్తాచూపలేక పోతున్నారని మరికొంతమంది రెడ్డి నేతల ఆవేదన. ఈ రెండు వ్యాఖ్యానాలు వేరువేరుగా అనిపించినా అంతర్గత ఉద్దేశ్యం మాత్రం ఒకటే.
రాష్ట్రంలో ఎప్పటికీ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కొనసాగాలన్నదే రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గ లక్ష్యంగా కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి రావడం జరుగుతుందో లేదో ... కానీ జగన్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారణంగా రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుందనే ప్రచారాన్ని కొంతమంది రెడ్డి సామాజికవర్గ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యేకంగా రాజకీయ పార్టీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అని పెరువుంది. 1956 సంవత్సరం నుంచి అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఘనత రెడ్డి సామాజికవర్గ నేతలదే.
ఈ స్థితిలో అధికారంలోకి వస్తుందో రాదో నిర్థారణ కాని పార్టీ జగన్ పార్టీ కోసం రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం ఇష్టంలేని ఆ సామాజికవర్గానికి చెందిన జెసి దివాకర్ రెడ్డి, వీరశివారెడ్డి వంటి నేతలు అసలు జగన్ "రెడ్డి'' సామాజికవర్గానికి చెందిన నాయకుడు కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
క్రైస్తవ మతంలో కులాలు లేవని, అందువల్ల తాతల తండ్రుల కాలం నుంచి క్రైస్తావునిగా వున్న జగన్ రెడ్డి సామాజికవర్గానికి చెందడని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ సంగతి పక్కన పెడదాం ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సామాజికవర్గానికి చెందినవాడు ... ఆ సామాజికవర్గ ప్రాధాన్యత నిలపాల్సిన బాధ్యతా ఆయనదే అన్నట్టుగా మాజీమంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ను దూరం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో తద్వారా రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కొనసాగించాలన్న తలంపు వీరశివారెడ్డిలో కనిపిస్తుండగా, ప్రస్తుతం వున్న రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వుందన్న భావనలో జీవన్ రెడ్డి మాటల్లో అర్థం అవుతుంది.