అక్టోబర్‌లోనే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్?!
posted on Jun 28, 2023 @ 1:59PM
తెలంగాణలో రాజకీయం ఇప్పటికే హీటెక్కింది. ఇప్పటికే పార్టీలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాయి. ఇక ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి చేరికలు పెరిగిపోతున్నాయి. పార్టీలు సైతం గెలుపు గుర్రాల కోసం వేటికవి సర్వేలు చేయించుకుంటున్నాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. రుతుపవనాలు ప్రవేశించి వాతావరణం చల్లబడిందే కానీ రాజకీయ ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయాయి. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేనంత ఆసక్తిని, ఉత్కంఠనూ రేకెత్తిస్తున్నాయి.
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అక్టోబర్ 10న తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందన్న అత్యంత విశ్వసనీయ సమాచారం ఒకటి బయటకొచ్చింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు పర్యటించి.. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమై పలు సలహాలు, సూచనలు ఇవ్వగా.. సరిగ్గా మూడు నెలలలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
తెలంగాణలో 2024 జనవరి 16తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరికి ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. దీని ప్రకారం అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని చూస్తున్నట్లుగా సమాచారం. అన్నీ కుదిరితే అక్టోబర్ 10వ తేదినే నోటిఫికేషన్ వెలువడవచ్చని తెలుస్తోంది. 2018లో శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినప్పుడు కూడా నవంబర్ 10న నోటిఫికేషన్ వెల్లడించింది. అదే విధంగా ఈసారి నెల రోజుల ముందే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ సమయాత్తమవుతున్నట్లు తెలుస్తుంది.
ఈ ఏడాది చివరిలో మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీసగఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూస్తే తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, గతంలో ఐదేళ్ల పదవీ కాలానికి ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఈసారి అలా చేయలేదు. పూర్తిగా ఐదేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయనేది తేలిపోయింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఒక నెల ముందుగా నవంబర్ లోనే ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమై అక్టోబర్ లోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారుల బదిలీలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలకు సూచించినట్టు సమాచారం. వీటిలో తెలంగాణ కూడా ఉండగా.. త్వరలోనే ఈ భారీ బదిలీల ప్రక్రియ మొదలు కానుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి అనుకూలమైన అధికారులను వారికి అవసరం ఉన్న జిల్లాలకు బదిలీ చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టడం పరిపాటి. వీరిలో కొందరిని ఎన్నికల కమిషన్ మరోసారి బదిలీ చేయడం.. విధుల నుండి తప్పించడం కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఒక్కసారి ఈ బదిలీల ప్రక్రియ మొదలైందంటే ఎన్నికల నగారా మోగినట్లే భావించాలి.