బీజేపీ నిజంగానే ఈటలను అక్కున చేర్చుకుందా?
posted on Jun 28, 2023 @ 1:41PM
రాజకీయాలతో ఏ మాత్రం పరిచయం ఉన్నా ఈటల పేరు తెలియకుండా ఉండదు. తెలంగాణ సాధన ఉద్యమం నుంచీ, రాష్ట్ర ఆవిర్భావం వరకూ, ఆ తరువాత కూడా ఓ ఐదేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాలలో , బీఆర్ఎస్ వ్యవహారాలలో ఈటల చాలా చాలా క్రియా శీలంగా వ్యవహరించారు. 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు జరిగిన తరువాత నుంచి తెలంగాణ ప్రగతిలో, సంక్షేమంలో ఈటల ముద్ర చాలా బలంగా ఉందని ఇప్పటికీ పార్టీ వర్గాలు గుర్తు చేసుకుంటూ ఉంటాయి.
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈటల బడ్జెట్ కేటాయింపులు హేతుబద్ధంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేవని బీఆర్ఎస్ వర్గాలే కాదు.. ప్రత్యర్థి పార్టీల నాయకులు కూడా అంటూ ఉండేవారు. సరే 2014 ఎన్నికలలో పార్టీని విజయపథంలో నడిపిన క్రెడిట్ కేసీఆర్ ఖాతాలో పడినా.. తెలంగాణ ప్రగతి బాట పట్టడంలో కొంత క్రెడిట్ ఈటల ఖాతాలో పడింది. సరే 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ఈటల విజయం సాధించారు కానీ కేసీఆర్ కేబినెట్ లో చోటు మాత్రం లభించలేదు. ఆ తరువాత విస్తరణ సమయంలో ఆయనకు ఆర్థిక శాఖ కాకుండా వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు కేసీఆర్. అప్పటికే కేసీఆర్ తో ఈటలకు విభేదాలున్నాయన్న ప్రచారం జోరందుకుంది. కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల కరోనా వ్యాప్తి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులను స్వయంగా సందర్శించారు. ఇతర మంత్రులు, నాయకుడు లాక్ డౌన్ పేరు చెప్పి ఇంటికే పరిమితమైన కాలంలో ఈటల విస్తృతంగా పర్యటించారు. అది అయిన వెంటనే ఈటలకు పార్టీలో ఉక్కపోత మొదలైంది. కబ్జా ఆరోపణలతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. సరే తనను పొమ్మన లేక పొగబెడుతున్నారని గ్రహించి ఈటల ఎమ్మెల్యే పదవికీ, పార్టీకీ రాజీనామా చేశారు.
ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారని అంతా భావించారు. ఈటల మొగ్గు కూడా కాంగ్రెస్ వైపే అని అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే రోజుల తరబడి మీమాంస అనంతరం ఈటల అనూహ్యంగా బీజేపీ గూటికి చేరారు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల కాంగ్రెస్ గూటికి చేరడమేమిటన్న అనుమానాలు, ఆశ్చర్యం అప్పట్లో సర్వత్రా వినిపించింది. ఇది జరిగిన కొన్నాళ్లకే ఈటల తాను రాజీనామా చేసిన హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. అధికార వైసీపీ ఎన్ని విధాలుగా ఈటల విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం సాధించలేకపోయి చతికిల పడింది. నియోజకవర్గంలో, బీసీలలో తనకున్న పట్టును ఈటల హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో 23, 855 ఓట్ల మెజారిటీతో గెలవడం ద్వారా నిరూపించుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఆ ఉప ఎన్నికలో విజయం సాధించినా.. ఈ గెలుపు మాత్రం ఈటల వ్యక్తిగత ఖాతాలోనే పడింది.
సరే ఈ విజయం తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ ఈటలకు బీజేపీలో ఉక్కపోత ప్రారంభమైందన్న వార్తలు వెలువడ్డాయి. ఆయన ఆ పార్టీలో ఇమడలేరనీ త్వరలో బయటకు రావడం ఖాయమన్న వార్తలు అప్పట్లోనే వినిపించాయి. వరుస సస్పెన్షన్లతో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిందన్న అసంతృప్తి ఈటలలో అప్పట్లోనే వ్యక్తమైంది. సరే బీజేపీ ఈటలకు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ను గమనించి కీలక పదవి ఇచ్చినప్పటికీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో విభేదాల కారణంగా చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ ఈటలలో అసంతృప్తి గూడుకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఊహాతీతంగా ఘోరంగా చతికిల బడింది. దీంతో దక్షిణాదిలో బీజేపీకి స్పేస్ లేదన్నది బహిర్గతమైంది. అప్పటి వరకూ తెలంగాణలో అధికారం మాదే అన్న ధీమాతో ఉన్న బీజేపీలో ఒక్క సారిగా ఆ ధీమా మటుమాయమైపోయింది.
ఆ పార్టీలోని సీనియర్ నేతలైతే అంతర్గత సంభాషణల్లో తెలంగాణలో బీజేపీ సింగిల్ డిజిట్ కు మించి సీట్లు గెలుచుకోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల బీజేపీని వీడుతున్నారన్న వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. వరుసగా జరిగిన పరిణామాలు కూడా ఆ విషయాన్నే ధృవీకరించేలా ఉండటంతో ఈటల కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా ఈటలకు హైకమాండ్ పిలుపు వచ్చింది. ఆయనతో పాటుగా కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా అధిష్ఠానం హస్తినకు పిలిచింది. వీరితో చర్చల అనంతరం అప్పటికే రెండు రోజుల పాటు హస్తినలో పార్టీ అగ్రనేతలతో వరుస భేటీలు జరిపిన బండి సంజయ్ ను కూడా హుటాహుటిన అధిష్ఠానం హస్తినకు పిలిపించుకుంది. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో ఈటల తన సతీమణితో కలిసి మంగళవారం (జూన్ 27) మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
మీడియా సమావేశానికి ముందు వరకూ ఈటల బీజేపీని వీడడం ఖాయమంటూ మీడియా, సోషల్ మీడియా ఊదరగొట్టింది. ఈటల భవిష్యత్ కార్యాచరణపై కూడా విశ్లేషణలతో హడావుడి చేసింది. తీరా తాను బీజేపీని వీడడం లేదనీ, బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) తనను వెళ్లగొట్టినప్పుడు అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీయేనని చెప్పిన ఈటల.. పార్టీ మారే ప్రశక్తే లేదని స్పష్టత ఇచ్చారు. దీంతో అధిష్ఠానానికి ఈటల ఏం చెప్పారు.
అధిష్ఠానం ఈయనకు ఏం హామీ ఇచ్చి ఉంటుందన్నదానిపై విస్తృత చర్చ సాగుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పుపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు కట్టబెట్టే అవకాశాలున్నాయంటూ రాజకీయ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. తన భర్త ఈటలకు కౌషిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ ఈటల జమున ఆరోపణలు చేసిన గంటల వ్యవధిలోనే వై కేటగరి భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఈటలకు రాష్ట్ర బీజేపీలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పదవిని కట్టబెట్టడం ఖాయమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.