ఎమ్మెల్సీ కవిత సన్నిహితులను విచారిస్తున్న ఈడీ.. డొంక కదులుతోందా?
posted on Sep 7, 2022 @ 12:52PM
ఢిల్లి లిక్కర్ స్కాం కేసీఆర్ కుటుంబం మెడకు చుట్టుకుంటోందా? తనపై ఆరోపణలకు చేయరాదంటూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా.. ఈడీ దూకుడు పెంచడంతో ఎమ్మెల్సీ కవితకు ఊరట లబించడం లేదా? సీబీఐకి తోడు ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసు విచారణలో వేగం పెరిగిందా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔననే అనాల్సి వస్తుంది.
అంతే కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ వ్యవహారంలో ఏకంగా తెలంగాణ సీఎస్ ప్రమేయంపై ఈడీ విచారణ ప్రారంభించడంతో తెలంగాణ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతోందని, మొత్తంగా ఈడీ దూకుడుతో తెలంగాణలో స్కాముల డొంక కదులుతోందనీ పరిశీలకులు అంటున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం అటు తిరిగి ఇటు తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆ కారణంగానే ఢిల్లీ లిక్కర్ స్కారం వ్యవహారం తెలంగాణలో ప్రపంకనలు సృష్టిస్తోంది. ఈ కుంభకోణంపై ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు సాగిస్తుండగా, ఇప్పుడు ఈడీ కూడా రంగంలోనికి దిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో దేశ వ్యాప్తంగా ఈడీ నిర్వహిస్తున్న సోదాలలో బాగంగా హైదరాబాద్ లో కూడా ఈడీ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
లిక్కర్ స్కాం కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్నిహితులు ఆరుగురిని ఈడీ బుధవారం ఉదయం నుంచి విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విచారణను హైదరాబాద్ కు చెందిన ఈడీ అధికారులు కాకుండా ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం నుంచి హైదరాబాద్ లోఅరుణ్ రామచంద్రన్ పిళ్లైతో సహా మరో ఐదుగురి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బోయినపల్లి అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలలె ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే రాబిన్ డిస్టిలర్స్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఒక వైపు సోదాలు జరుగుతుండగానే కవిత సన్నిహితులను ఈడీ అధికారులు విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి తోడు ఇటీవల హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ పై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి విదితమే. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-45లోని ఫీనిక్స్ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు కంపెనీ చైర్మన్ చుక్కపల్లి సురేష్, కంపెనీ డైరెక్టర్ల నివాసాలపై మదాపూర్‌లోని ఫీనిక్స్ ఐటీ సెజ్‌పైనా కూడా ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కూడా ఈడీ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఫీనెక్స్ వ్యవహారంలో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు లింకులు ఉన్నట్లుగా అందిన సమాచారంపై కూడా ఈడీ విచారిస్తున్నట్లు తెలిసింది.
ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్‌ఫ్రాలో ఫీనిక్స్ పెట్టుబడులు ఉన్నాయి. కాగా ఫీనిక్స్‌లో చాలా మంది రాజకీయ ప్రముఖుల పెట్టుబడులు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫీనిక్స్ వ్యవహారంలో తెలంగాణ సీఎస్ సురేష్ కుమార్ కు లింకులపై ఈడీ ఆరా తీయడం సంచలనం సృష్టించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న వార్తలు రావడంతో అంతటా ఈడీ సోదాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ కుంభ కోణంలో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తనపై ఆరోపణలు చేయకుండా ఆమె కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అలాగే ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు జగన్ సతీమణి పేరు కూడా ఉందని టీడీపీ ఆరోపిస్తున్నది. దీనిపై రాజకీయదుమారం కొనసాగుతోంది. సీబీఐ ఈడీ విచారణలతో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకోవడం అనివార్యంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.