త్వరలో ప్రగతి భవన్ లో ఈడీ, ఐటీ జమిలి దాడులు
posted on Sep 21, 2022 @ 4:46PM
కేసీఆర్ కుటుంబ సభ్యులు లక్ష్యంగా ఇక ఈడీ, ఐటీ జమిలి దాడులకు రంగం సిద్ధమైందా అంటే అధికారవర్గాల నుంచి ఔననే బదులు వస్తోంది. ఒక అధికారి బదలీ.. ఒకే ఒక్క అధికారి బదలీ... తెరాస ప్రభుత్వం కాళ్ల కింద భూమి కదిలిపోతోందా అన్నట్లుగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
తెలంగాణ డీజీపీ రేసులో ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య అయిన హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా వసుంధర సిన్హా బదలీ ,ఆమె స్థానంలో ముంబై ఐటీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించే సంజయ్ బహదూర్ ని తీసుకురావడంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్ కుటుంబ సన్నిహితులను విచారిస్తున్న ఈడీకి ఇప్పుడు ఇక ఐటీ దాడులు తోడయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కేసీఆర్ కు సన్నిహితురాలైన వసుంధర సిన్హా ఐటీ దాడులు, విచారణకు సంబంధించిన సమాచారాన్నికేసీఆర్ కు లీక్ చేస్తున్నట్లుగా అనుమానించిన పై అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆమెను ఆ స్థానంలో నుంచి తప్పించి సమర్ధుడైన అధికారిగా పేరున్న సంజయ్ బహదూర్ ను తీసుకు వచ్చారని అంటున్నారు.
సంజయ్ బహదూర్ ఇప్పటికే తన పని మొదలెట్టేశారని కూడా అధికార వర్గాల విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారి ఆఫీసులు, నివాసాల్లోనే జరుగుతున్న సోదాలు ఏ క్షణంలోనైనా సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ కు చేరే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారం.
ఇప్పటికే ఈ నెలలో రెండు వారాల వ్యవధిలోనే మూడుసార్లు దాడులు చేసిన ఈడీ బృందాలు పలు వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆదాయ వివరాలను పరిశీలించేందుకు ఐటీ సహకారం కోరాయి. దీంతో అగ్నికి అజ్యం పోసినట్లు జమిలిగా ఈడీ, ఐటీలు దూకుడు పెంచినట్లైంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ,ఐటీ సమష్టిగా కేసీఆర్ కు బంధువు అయిన వెన్నమనేని శ్రీనివాసరావును విచారించాయి. ఈ విచారణలో ఆయన నిర్వహిస్తున్న సంస్థలు అన్నీ సూట్ కేసు కంపెనీలేనని తేలింది. కేవలం మనీ లాండరింగ్ కోసం వాడుకుంటున్నవేననీ తెలినట్లు తెలుస్తోంది. కాగా ఈ దాడులపై టీఆర్ఎస్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందాయన్న ప్రచారాన్ని కవిత వినా మిగిలిన టీఆర్ఎస్ నేతలు ఎవరూ ఖండించకపోవడమే ఇందుకు తార్కాణంగా పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంలో సంతోష్ కుమార్ పేరు కూడా బయటకు వచ్చింది.
ఈడీ..బోడీ ఎవరూ ఏమీ చేయలేరంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల పట్ల సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. మోడీ నన్ను గోకకపోయినా నేను ఆయనను గోకుతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మోడీ సర్కార్ ఢిల్లీ లిక్కర్ స్కారం వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం నిగ్గు తేల్చేందుకు నిర్ణయించుకుందని అంటున్నారు. కేసీఆర్ కు సమాచారం లీక్ చేస్తున్నారన్న అనుమానంతో వసుంధర సిన్హా ను బదిలీ చేసి ఆమె స్థానంలో సమర్ధుడైన అధికారిగా గుర్తింపు పొందిన సంజయ్ బహదూర్ ను తీసుకురావడం కీలక పరిణామంగా చెబుతున్నారు. సంజయ్ బహదూర్ అప్పుడే తన పని ప్రారంభించేశారనీ, ఈ కేసులు సంబంధించి ఏ క్షణంలోనైనా సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అధికార వర్గాల బోగట్టా. ఇప్పుడు ఇక ఈడీ, ఐటీ దాడులు ప్రగతి భవన్ కు చేరే అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు.
కేంద్ర హోమంత్రి హోదాలో ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమిత్ షా ఇక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీ (ఎస్ వీపీ ఎన్ పిఏ) పోలీసు అకాడమీలో ఈడీ, ఐటీ అధికారులతో సమీక్ష నిర్వహించడం కూడా ఈ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయనడానికి తార్కాణంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ సాగిన దాడులు, విచారణలు ఒకటైతే ఇక ముందు జరగబోయే దాడులు, విచారణలు ఒకెత్తుగా వారు అభివర్ణిస్తున్నారు. మొత్తంగా డిల్లీలిక్కర్ స్కాం తీగ లాగితే కేసీఆర్ కుటుంబం డొంక కదులుతోందన్న అభిప్రాయం అయితే అధికారులలో వెల్లడౌతోంది. ఈ నేపథ్యంలోనే రానున్న రెండు మూడు రోజులలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.