వినాశకాలే విపరీత బుద్ధి..!
posted on Sep 21, 2022 @ 4:58PM
రాజకీయాలలో, ఆత్మ హత్యలే కానీ, హత్యలు ఉండవు అంటారు పెద్దలు. అది నిజమని గతంలో అనేక మంది రుజువు చేశారు. ఇప్పుడు ఎన్డీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా అటువంటిదే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏ దేవుడు ఏ కలలో ఆదేశించాడో ఏమో కానీ, అయన రాత్రికిరాత్రి ఆత్మహత్యా సద్రుస్యమైన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో ఉన్నమంద బలాన్ని అడ్డుపెట్టుకుని అత్యంత అప్రజాస్వామిక పద్దతిలో తెలుగు ప్రజలను అవమానించే నిర్ణయాన్ని తీసుకున్నారు.
తెలుగు దేశం పార్టీతో ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో,అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నైనా విభేదాలు ఉండవచ్చును. కానీ, ఆ కారణంగా, దివంగత నేత, నందమూరి తారక రామా రావు పేరును తుడిచేయడం అపచారం, నేరం అంటే సరిపోదు. ఒక్క మాటలో చెప్పాలంటే, వినాశకాలే విపరీత బుద్ధి.. అంతకు మించి వేరే చెప్పవలసింది లేదు, ఉండదు. రాజకీయంగా, పోగాలం దాపురించిన వారు మాత్రమే ఇలాంటి అపచారానికి ఒడిగడతారు.
నిజానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడచిన మూడు సంవత్సరాలలో తనకు తానుగా ఎన్నెన్ని గోతులు తవ్వుకుందో లెక్కలేదు. అయితే, ఇప్పుడు చేసిన తప్పు, సామాన్యమైన తప్పు కాదు. మహా పాపం. ఒక విధంగా తమ రాజకీయ సమాధికి తామే ఇటుకలు పేర్చుకోవడంతో సమానం. ఎన్టీఅర్, తెలుగు దేశం పార్టీ స్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు. పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతాలకు పరిమితం అయిన సమాన్య వ్యక్తి, నాయకుడుమ నటుడు మాత్రమే కాదు. కుల మత రాజకీయాలకు అతీతంగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామ రావు. ఆంధ్రుల అన్నగా తెలుగు వారి గుండెల్లో గుడికట్టుకున్న శ్రీరామ చద్రుడు. శ్రీ కృష్ణుడు, ఎన్టీఅర్. అలాంటి మహనీయుని ఇలా అవమానిస్తే, తెలుగు ప్రజలు క్షమించరు. క్షమిస్తే వారు తెలుగు ప్రజలు కాదు.
నిజానికి, వైఎస్సార్ బతికుంటే, ఎన్టీఆర్ పేరు తీసి తన పేరు తగిలించడాన్ని, ఎట్టి పరిస్థితిలో అంగీకరించకపోవునేమో, నిజమే, వైఎస్సార్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరును మార్చారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒత్తిడితో ఎన్టీఆర్ పేరును తీసి, రాజీవ్ గాంధీ పేరును తగిలించారు. కానీ, ఆయన ఏ నాడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలనే ఆలోచన కూడా చేయలేదు. కారణం ఎన్టీఅర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఅర్ మానస పుత్రిక. హెల్త్ యూనివర్శిటీ పెట్టాలనే ఆలోచన ఎన్టీఆర్‌ది. ఆచరణలోకి తెచ్చింది ఎన్టీఆర్. అందుకే ఆయన మరణం తర్వాత అందరి ఆమోదంతో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు ఆయన పేరు పెట్టారు.
పాతికేళ్లుగా ఆ పేరు అలాగే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఎవరూ పేరు గురించి ఆలోచించలేదు. అసలు పేరు మార్చాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు. జగన్మోహన్ రెడ్డికే వచ్చింది. అవును, తమ గొయ్యి తామే తవ్వుకునే వారికే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలోస్తాయి. దుష్ట సంకల్పం కలుగుతుంది. అందుకే, వినాశకాలే విరీత బుద్ధి: అనవలసి వస్తోంది.