Read more!

సముద్రాలకు రక్షణ ఎక్కడ?

బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది అనే మాట మనకు అందరికీ తెలిసినదే. చుక్క చుక్క నీటి బొట్టు కలిస్తేనే సముద్రమైనా ఏర్పడేది. లేకపోతే సముద్రానికి మాత్రం రూపమెక్కడ. అంటే సముద్రం ఉనికి చుక్క నీటిబొట్టులో కూడా ఉందని అర్థం. సముద్రాలు ఈ భూమి మీద ప్రధాన పాత్రలు పోషిస్తాయి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి వంటి పంచభూతాలలో నీటిని నింపుకున్నవి సముద్రాలు. ఇవి కేవలం నీటి వనరులుగా కాకుండా ఎన్నో రకాల ఖనిజసంపదలకు  నిలయం. దేశాలను, ఖండాలను వేరు చేస్తూ ఉన్న ఈ సముద్రాలు జలమార్గానికి అనువైనవి. వాణిజ్యానికి అందులో ముఖ్యమైన ఎగుమతులు, దిగుమతులకు ఎక్కువభాగం సముద్రాలే ఉపయోగపడుతున్నాయి.

జరుగుతున్న నష్టాలు!

సముద్రాలు ఎంత గొప్పవో అందరికీ తెలిసిందే. అయితే చాలామంది వీటిని పుస్తకాల్లో చదువుకోవడం, టీవీలలో చూడటం జరుగుతూ ఉంటుంది. కొందరు మాత్రమే సముద్ర తీర ప్రాంతాలలో నివసించేవారు, పర్యాటకం  మీద ఆసక్తి ఉన్నవారు సముద్రాలను దగ్గరగా చూస్తూ ఉంటారు. అలాంటివాళ్లకు సముద్రపు నీళ్లలో ఎక్కువగా కనిపించేవి ఏవి అని అడిగితే బాగా సమాధానం ఇస్తారు. ఇంతకూ సముద్రపు నీళ్లలో ఎక్కువగా కనబడుతున్నది ఏమిటంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ అనేది కవర్ల రూపంలో ఈ పర్యావరణాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద భూతం అని చెప్పుకోవచ్చు. సముద్రతీర ప్రాంతాలలో ఫ్యాక్టరీలు గనుక ఉంటే ఫ్యాక్టరీలు విడుదల చేసే వ్యర్థాలు, రసాయనాలు, చెత్త అంతా సముద్రంలోకే వదిలేస్తున్నారు. ఫలితంగా సముద్రాలకు చెప్పలేనంత నష్టం వాటిల్లుతోంది. అది మాత్రమే కాకుండా ఈ రసాయనాల ప్రభావం వల్ల సముద్రంలో పెరిగే ఎన్నో రకాల సముద్ర జాతి జీవులు చనిపోవడం మాత్రమే కాకుండా అంతరించిపోతున్నాయి కూడా.

స్వార్థపు అడుగులు!

మనుషులకు స్వార్థం ఎక్కువ. అందుకే ఎక్కడ ఏమి దొరికినా దాన్ని చేజిక్కించుకుంటూ పోతాడు. అదే పద్దతిలో సముద్రాలను కూడా ఇష్టమొచ్చినట్టు నాశనం చేస్తుంటాడు. సముద్రగర్భంలో లభ్యమయ్యే ఖనిజ సంపదలు అయిన పెట్రోలియం వంటి చమురు నిక్షేపాల కోసం నిక్షేపంగా ఉండే సముద్రాల గర్భాలను అల్లకల్లోలం చేస్తున్నారు. అలాగే సముద్రంలో ఎంతో విలువైన ముత్యాలు, బంగారు గనులు వంటివి కూడా చాలా మిస్టరీగా ఉంటాయి. వాటికోసం ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. సముద్ర గర్భాలలో జరిగే కదలికల వల్ల సముద్రపు విస్ఫోటనాలు, సునామీలు సంభవిస్తూ ఉంటాయి. సముద్రంలో కలుస్తున్న వ్యర్థాల వల్ల చేపలు కూడా విషపూరితంగా మారిపోతూ ఉంటాయి. ఎన్నో అరుదైన సముద్ర జాతులు అంతరించిపోతూ ఉంటాయి. 

మన కర్తవ్యం!

నిజానికి సముద్రాలకు నష్టం జరుగుతున్న మార్గం తెలిస్తే అవన్నీ అంతర్జాతీయ సమస్యలుగా అనిపిస్తాయి. కానీ మనుషులు పీలుస్తున్న ఆక్సిజన్ లో 70% సముద్రాల నుండి లభిస్తున్నదే అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి సముద్రాలు మాత్రం ఆమ్లాన్ని నింపుకుని కలుషితం అయిపోతున్నాయి. సముద్రాల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మత్స్యకారులు మాత్రమే కాకుండా సాముధ్రాంతర్గత కార్యకలాపాల మీద ఆధారపడున్నవాళ్ళు  చాలామంది ఉన్నారు. ఎక్కువభాగం అగ్నిపర్వతాల పేలుళ్లు సముద్రాలలో సంభవిస్తున్నాయి. అదే సముద్రాల మనుగడ కష్టమైనప్పుడు మానవ సంచార ప్రాంతాలలో అవి సంభవిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి. 

ఇవి మాత్రమే కాకుండా సముద్రాల వలన తెలియని ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి. వాటి వల్లనే చాలామంది ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. సముద్ర ప్రయాణంలో ఆటుపోట్లు అనేవి ఎలాంటివో సముద్రాలను నాశనం చేస్తే మనుషుల మనుగడ అలాగే అటుపోట్లలో చిక్కుకున్నట్టు అవుతుంది.

కాబట్టి సముద్రాలను కాపాడుకోవడం అందరి బాధ్యత. బీచుకు వెళ్తే మీ వంతుగా నష్టం కలిగించకండి మరి.

 ◆వెంకటేష్ పువ్వాడ