లైంగిక రోగాలని పంచే ATMలు

 


క్రిములనేవి రాక్షసులలాగా ఇంతింత ఆకారాలతో మన మీద దాడి చేయవు. ప్రకటనల్లో చూపించినట్లుగా కేకలు వేస్తూ కూర్చోవు. అవి మన చుట్టు పక్కల ఎక్కడ పడితే అక్కడ కాచుకుని ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంటాయి. పళ్లు తోముకునే బ్రష్‌ల దగ్గర నుంచి కీబోర్డుల వరకూ క్రిములు సర్వత్రా వ్యాపించి ఉంటాయి. ఇప్పుడు ATMలలో కూడా నానారకాల క్రిములూ ఉన్నాయని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.

 

అమెరికాలో సైతం

‘అదే అమెరికాలో అయితేనా’ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ATMలలో క్రిములుంటాయని బయటపడింది అమెరికాలోనే! జేన్‌ కార్ల్‌టన్‌ అనే శాస్త్రవేత్త ఈ పరిశోధనని నిర్వహించారు. ఇందుకోసం ఆయన బ్రూక్లిన్‌, మన్‌హాటన్ వంటి ప్రాంతాలలో ఉన్న 66 ఏటీఎం కీబోర్డుల మీద ఉన్న దుమ్ముని సేకరించారు. ఆ దుమ్ముని పరిశీలించగా వంటింటి దగ్గర నుంచీ మరుగుదొడ్ల వరకూ కనిపించే నానారకాల క్రిములూ వాటి మీదే ఉన్నట్లు తేలింది.

 

లైంగిక వ్యాధులు సైతం

ATM కీప్యాడ్‌ల మీద పాలపదార్థాలు, కుళ్లిపోయిన మొక్కల ద్వారా వృద్ధి చెందే ‘లాక్టోబాసిలస్’ అనే తరహా బ్యాక్టీరియా ఎక్కువగా కనిపించిందట. ఇక Actinobacteria, Bacilli, Clostridia వంటి నానారకాల క్రిములతో పాటుగా లైంగిక వ్యాధులను కలిగించే Trichomonas vaginalis అనే క్రిమి కూడా కనిపించడంతో పరిశోధకుల దిమ్మ తిరిగిపోయింది.

 

ప్రాంతాన్ని బట్టి

ఏటీఎంలు ఉన్న ప్రాంతాలను బట్టి ఒకోచోట ఒకో తరహా క్రిములు కనిపించాయట. అవి అక్కడ నివసించే ప్రజల ఆహారపు అలవాట్లని సూచించడం విశేషం. ఉదాహరణకు చైనాటౌన్‌లో ఉన్న ఏటీఎంల మీద చేపలకి సంబంధించిన క్రిములు కనిపిస్తే, తెల్లవారు ఎక్కువగా నివసించే మన్‌హాటన్‌లో బేకరీ పదార్థాల మీద పేరుకునే క్రిములు కనిపించాయి. అయితే కొన్ని రకాల క్రిములు మాత్రం ప్రతి ఏటీఎంలోనూ దర్శనమిచ్చాయి. ఇంకా చిత్రమేమిటంటే నాలుగు గోడల మధ్యా సురక్షితంగా కనిపించే ఏటీఎంలలో కూడా కావల్సినన్ని క్రిములు కనిపించాయి.

 

చేతులు కడుక్కోవడమే!

పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని ఇప్పుడు ప్రతివారూ ఏటీఎంల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. తీసుకునే నగదు మీద పరిమితులు ఉండటంతో, ఒకటికి పదిసార్లు ఏటీఎంలని ఆశ్రయించక తప్పడం లేదు. కాబట్టి ఏటీఎంల ద్వారా క్రిములు వ్యాపించే ప్రమాదం ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. దీనికి మన వంతుగా చేయగలిగింది ఒక్కటే! ఇతరులకు మన నుంచి క్రిములు వ్యాపించకుండా ఎప్పటికప్పుడు చేతలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఏటీఎం నుంచి వచ్చిన తరువాత కూడా చేతులను కడుక్కోవాలి. లేకపోతే డబ్బుతో పాటుగా రోగాలని కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది.

 

- నిర్జర.