ఈడీ విచారణకు పూరి జగన్నాథ్, ఛార్మి
posted on Nov 17, 2022 @ 9:58PM
ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ ను, నటి, నిర్మాత చార్మిని వివాదాల్లోకి లాగింది. సినిమా చిత్రీకరణ నుంచి ప్రచారం, విడుదల, ఆ తరువాత ఫలితం, ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్స్ ఇలా ఆ చిత్రానికి సంబంధించిన ప్రతీ విషయమూ, ప్రతి అంశమూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. తాజాగా ఇప్పుడా చిత్రానికి పెట్టుబడులు ఎలా వచ్చాయన్న విషయంపై ఈడీ కూపీలాగుతోంది.
ఇందు కోసం పూరీ జగన్నాథ్ ను, నటి ఛార్మీని విచారణకు పిలిచింది. ఈడీ పిలుపు మేరకు పూరి జగన్నాథ్, ఛార్మీలు గురువారం హైదరాబాద్ లోకి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మిలు గతంలో డ్రగ్స్ వ్యవహారంలో ఒక సారి ఎక్సైజ్ అధికారుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఇరువురికీ కూడా క్లీన్ చిట్ లభించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు లైగర్ సినిమాలో పెట్టుబడులు ఎక్కడ నుంచి వీరిద్దరు కలిసి ఇటీవల విజయ్ దేవర కొండ హీరోగా ‘లైగర్’ మూవీ నిర్మించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు దర్శకత్వం పూరి జగన్నాథే. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినీమా విడుదలైన తరువాత ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సినిమా కోసం జరిగిన నగదు లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు, ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆధారాలు సేకరించారని చెబుతున్నారు.
అంతే కాకుండా ఈ సినిమాలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఈడీ పూరి జగన్నాథ్, ఛార్మీలను విచారించడం సంచలనం సృష్టించింది. ఈ విషయంపై సినీ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.