హిమాచల్ లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా
posted on Nov 17, 2022 @ 4:17PM
హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో ఒకే విడతలో పోలింగ్ శనివారం ముగిసిన సంగతి తెలిసిందే. గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ మొదటి వారంలో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అయితే డిసెంబర్ 5న వెలువడతాయి. కాగా హిమాచాల్ ప్రదేశ్ లోని 68 నియోజకవర్గాలలోనూ ఓకే విడతలో పోలింగ్ పూర్తయ్యింది. రంగంలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. రాష్ట్రంలో ఇంత కాలం కాంగ్రెస్, బీజేపీల మధ్య ద్విముఖ పోరే ఉండేది. అయితే అందుకు భిన్నంగా ఈ సారి ఆప్ కూడా పోటీలో ఉండటంతో త్రిముఖ పోరు జరిగిందని పరిశీలకులు అంటున్నారు. అదలా ఉంచితే ఎన్నికలకు ముందు హిమాచల్ ప్రదేశ్ లో సర్వేలన్నీ ఆప్ ది నామమాత్రపు పోటీయే అని పేర్కొన్నాయి.
అదే సమయంలో ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని తేల్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఏ పార్టీ ఇంత వరకూ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు. ఆ ఆనవాయితీ ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ విపక్షానికి పరిమితమవ్వక తప్పదనీ, కాంగ్రెస్ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం తధ్యమని పరిశీలకులు అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ సారి ఆ ఆనవాయితీని బద్దలు కొట్టి తాము రెండో సారి అధికారాన్ని చేపడతామన్న ధీమాను బీజేపీ వ్యక్తం చేస్తున్నది. 2017 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 43 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 22 చోట్ల గెలిచింది. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక సీపీఎం ఎమ్మెల్యే విజయం సాధించారు. కాగా గత ఎన్నికలలో కనీసం 20స్థానాల్లో గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది.
ఆయా స్థానాల్లో సుమారు 3వేల ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. ఈ 20 స్థానాల్లోని 6 సీట్లలో మెజారిటీ 1000, అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక 34 నియోజకవర్గాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 5000, అంతకన్నా తక్కువగా ఉంది. దీని బట్టి.. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల వేడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉండటంతో ఆప్ వల్ల ఏ పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లుతుందన్న విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆప్ ఉనికి వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ లాభపడుతుందని కొందరు చెబుతుంటే.. ప్రభుత్వ అనుకూల ఓటునే ఆప్ చీలుస్తుందని మరి కొందరు విశ్లేషిస్తున్నారు.
అయితే శ్రీ ఆత్మసాక్షి ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో చేసిన సర్వే మేరకు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు అనివార్యమని తేలింది. సర్వే అంచనా ప్రకారం బీజేపీ రాష్ట్రంలో 31 నుంచి 35 స్థానాలలోనూ, కాంగ్రెస్ 33 నంచి 36 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆప్ ఒక స్థానం, ఇతరులు ఒక స్థానం గెలుచుకునే అవకాశాలున్నాయి, ముఖ్యంగా కంగ్రా ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది.
ఇక్కడ యాపిల్ రైతులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తమౌతోంది.నిరుద్యోగయువత, ప్రభుత్వోద్యోగులు కూడా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇక మహిళల ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోనున్నాయని సర్వే తేల్చింది. ఇక పోతే ఆప్ పోటీ కారణంగా కనీసం పది స్థానాలలో బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని సర్వే తేల్చింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా బీజేపీపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉంది.