మళ్ళీ గోతిలో పడిన కాంగ్రెస్
posted on Mar 11, 2014 @ 4:12PM
కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధుల కోసం తీసిన గోతులలో తరచూ తనే పడుతూలేస్తున్నా కూడా దాని తీరు మాత్రం మారడం లేదు. కాంగ్రెస్ తో విలీనానికి, పొత్తులకు కేసీఆర్ అంగీకరించకపోవడంతో, కేసీఆర్ ను దెబ్బతీద్దామనే ఆలోచనతో తెలంగాణాలో పర్యటించిన కేంద్రమంత్రి జైరామ్ రమేష్, తమపార్టీ అధికారంలోకి వస్తే దళితుడనే తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రిగా చేతామని, అది తన మాటే కాదని రాహుల్ గాంధీ కూడా అదే కోరుకొంటున్నారని ప్రకటించారు. కానీ టీ-కాంగ్రెస్ నేతల ఆగ్రహాన్ని చవిచూసిన ఆయన కేవలం రెండు గంటలలోనే తన మాట మార్చి తన పరువు, పార్టీ పరువు కూడా తీసుకొన్నారు.
ఇక ఈయన మాట్లాడిన ప్రతీ ముక్కకి డిల్లీ నుండి అర్ధ తాత్పర్యాలు వివరించే దిగ్గీరాజా మీడియాతో మాట్లాడుతూ, “దళిత ముఖ్యమంత్రి అనేది జైరామ్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చును. ఆ విషయంపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటాము," అని చెప్పి చేతులు దులుపుకొన్నారు. అయితే జైరామ్ రమేష్ మొదట మాట్లాడినప్పుడు అది కేవలం తన అభిప్రాయమే కాదని, తమ యువరాజు రాహుల్ గాంధీ అభిప్రాయంగా ప్రజలకు తెలియజేస్తున్నానని చెప్పినపుడు, ఇప్పుడు దిగ్విజయ్ ఆయన ప్రకటనతో పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని చెప్పడం చూస్తే, కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ తను గోతిలో పడ్డామని అర్ధం చేసుకొన్నందునే దానిని జైరామ్ మీదకు త్రోసేసి చేతులు దులుపుకొని ఉండవచ్చును.